
గడువులోపు అర్జీలను పరిష్కరించకపోతే చర్యలు
కర్నూలు(సెంట్రల్): నిర్ణీత గడువులోపు అర్జీలను పరిష్కరించకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో(పీజీఆర్‌ఎస్) కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడువు దాటినా అర్జీలను పరిష్కరించని ఆదోని మునిసిపల్ కమిషనర్, జిల్లా రిజిస్ట్రార్, వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌లపై చర్యలు తీసుకోవాలని డీఆర్వో సి.వెంకటనారాయణమ్మను ఆదేశించారు. అదేవిధంగా అర్జీలను పెండింగ్‌లో పెట్టిన అధికారులందరిపైనా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. అధికారులకు కేవలం మెమోలు ఇవ్వడం కాదని, వారి ప్రవర్తనలో మార్పు రాకుంటే సస్పెండ్ చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్‌పీడీ చిరంజీవి, స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.