
ఉద్యోగాల పేరుతో మోసం
● ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు ● పీజీఆర్‌ఎస్‌కు 83 ఫిర్యాదులు
కర్నూలు: ప్రభుత్వ పాఠశాలల్లో ఫిజికల్ ట్రైనర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి విజయవాడకు చెందిన శివ, కోవెలకుంట్లకు చెందిన రామకృష్ణలు కలసి ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల చొప్పున డబ్బులు తీసుకుని మోసం చేశారని ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు పత్తికొండ మండలం పులికొండ గ్రామానికి చెందిన రాజశేఖర్, నరేష్, లింగరాజు, పీటర్‌పాల్, చైతన్యలు ఫిర్యాదు చేశారు. ఆదోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి దేవదానం, జ్యోతి కలసి రూ.5 లక్షలు తీసుకుని మోసం చేశారని కౌతాళం మండలం చింతపల్లి గ్రామానికి చెందిన రాజు, మునిస్వామిలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్పీ విక్రాంత్ పాటిల్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 83 ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారమయ్యేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని...
● కోడలు, ఆమె బంధువులు తన కుమారుడిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని గణేష్ నగర్‌కు చెందిన అజ్మత్ ఖాన్ ఫిర్యాదు చేశారు.
● కొడుకు, కోడలు తమపై దాడి చేసి పొదుపులో వచ్చిన డబ్బులు లాక్కున్నారని తుగ్గలి మండలం గుండాలతండాకు చెందిన దానమ్మ, రాముడు నాయక్ దంపతులు ఫిర్యాదు చేశారు.
● తమ్ముడు శివరాజు మద్యానికి బానిసై తల్లిదండ్రులు తనకు ఇచ్చిన ఆస్తి భాగాన్ని వేరేవాళ్లకు అమ్ముకున్నాడని, విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా ఆదోని స్వామిరెడ్డి నగర్‌కు చెందిన తిరుపాల్ ఫిర్యాదు చేశారు.