
పుట్టుకతో చెవిటి, మూగ.. ఆపై మెదడులో సమస్య
పక్షవాతం వేధిస్తున్నా పింఛను పోయింది
కూర్చోలేదు, నిల్చోలేదు..
వికలత్వమే లేదంట!
పింఛన్ల రద్దు నోటీసులతో
దివ్యాంగుల గగ్గోలు
గతంలో వంద శాతం వికలత్వం ఉన్నట్లు సదరంలోనే ధ్రువీకరణ
ఇప్పుడు ఏకంగా 40 శాతం కూడా లేనట్లు సర్టిఫికెట్లు
కొందరికి ఎలాంటి వైకల్యం లేకపోయినా పెరిగిన వైకల్య శాతం
రాజకీయ సిఫారసులకు పెద్దపీట!
పెద్ద ఎత్తున నిరసనలకు
సిద్ధమవుతున్న దివ్యాంగులు
తుగ్గలి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న దివ్యాంగులు
ఈ బాలిక పేరు ఎస్.మెహతాజ్. కర్నూలు నగరంలోని చిత్తారివీధి. పుట్టుకతోనే చెవిటి, మూగ. 2011లో సదరం క్యాంపునకు హాజరు కాగా వైద్యులు పరీక్షలు నిర్వహించి 100 శాతం వైకల్యం ఉన్నట్లు సరిఫికెట్ జారీ చేశారు. ఆ తర్వాత బాలికకు మెదడులోనూ సమస్య మొదలైంది. ఇటీవల సదరం రీ వెరిఫికేషన్‌కు హాజరు కాగా.. 40శాతం లోపే సమస్య ఉన్నట్లు నిర్ధారించారు. అది కూడా తాత్కాలికమేనంటూ పింఛనుకు అనర్హురాలిగా తేల్చారు.
ఈ చిత్రంలోని వ్యక్తి పేరు శివరామ్ మధు. ఓర్వకల్ మండలం లొద్దిపల్లి గ్రామం. కొన్నేళ్ల కిత్రమే పక్షవాతంతో ఎడమ చేయి, కాలు పడిపోయాయి. 2010లో సదరం క్యాంపునకు హాజరు కాగా 94 శాతం వికలత్వం ఉన్నట్లు ధ్రువీకరించారు. ఇప్పటికీ ఒకరి సహాయం లేనిదే కదల్లేని పరిస్థితి. ఇటీవల నిర్వహించిన రీవెరిఫికేషన్‌లో అసలు వికలత్వమే లేనట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పింఛనుకు అనర్హుడిగా నోటీసు అందించారు.
ఈమె పేరు ఉప్పరి వెంకటలక్ష్మి. తుగ్గలి మండలం అమీనాబాద్ గ్రామం. చిన్నతనంలోనే పోలియో బారిన పడింది. దీనికి తోడు కింద పడటంతో కాలు విరిగి రాడ్ వేయించుకుంది. సొంతంగా కూర్చోలేదు, నిలబడలేదు. గతంలో 72 శాతం వికలత్వం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ జారీ చేశారు. ఇటీవల రీవెరిఫికేషన్‌కు హాజరు కాగా అసలు వికలత్వమే లేనట్లు పేర్కొనడం గమనార్హం. ఈ కారణంగా ఆమె పింఛను కోల్పోయింది.
కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం దివ్యాంగులను వీధిన పడేసింది. ఉన్న కాస్త ఆసరాను కూడా దూరం చేసి నిర్దయగా వ్యవహరిస్తోంది. ఊహించినట్లుగానే అనర్హత పేరిట పెద్ద ఎత్తున పింఛన్లను తొలగించడంతో దివ్యాంగులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో చాలాచోట్ల రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వంద కాదు.. రెండు వందలు కాదు.. ఏకంగా వేలాది పింఛన్లను అనర్హత ముసుగులో అడ్డంగా తొలగించడం విమర్శలకు తావిస్తోంది. సదరం సర్టిఫికెట్ల జారీ 2009–2010లో మొదలైంది. అప్పట్లో 100 శాతం వికలత్వం ఉంటే నేడు రీ వెరిఫికేషన్‌లో 40 శాతంలోపునకు తగ్గిపోయి పింఛను లేకుండా పోతోంది. సదరం క్యాంపుల్లో బేరసారాలు, రాజకీయ సిఫారసులకు పెద్దపీట వేసినట్లు చర్చ జరుగుతోంది. సోమవారం జరిగిన గ్రీవెన్స్‌కు పింఛన్లు పోయిన దివ్యాంగులు క్యూ కట్టారు. గతంలో వెరిఫై చేసి సర్టిఫికెట్లు ఇచ్చింది డాక్టర్లే.. అప్పుడు 85, 90, 100 శాతం వికలత్వం ఉంటే ఇప్పుడు 40 లోపు ఎలా తగ్గుతోందంటూ బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
ఇప్పుడిప్పుడే బయటపడుతున్న
తొలగింపులు
దివ్యాంగుల పింఛను తొలగింపులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో సచివాలయాలు తెరుచుకోలేదు. సోమవారం వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు దివ్యాంగులకు రీ వెరిఫికేషన్ సదరం సర్టిఫికెట్, నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు అందుకున్న వారిలో ఎక్కువ మందికి పింఛనుకు అనర్హత ఉన్నట్లు తేలడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. దిక్కుతోచని స్థితిలో కలెక్టరేట్‌కు, మండలాల్లో ఎంపీడీఓల వద్దకు చేరుకొని తమ గోడు వినిపిస్తున్నారు. అనధికార సమాచారం మేరకు ఉమ్మడి జిల్లాలో 10,050 పింఛన్లను తొలగించారు. ఈ నెల 27వ తేదీ వరకు సదరం రీ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు, నోటీసులు ఇచ్చేందుకు అవకాశం ఉంది. రోజురోజుకు పింఛన్లు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తొలగింపులకు గురైన వారిలో చెవిటి, మూగ, శారీరక వికలాంగులు, అంధులే అధికంగా ఉంటున్నారు.
సిఫారసులకు పెద్దపీట
సరదం రీవెరిఫికేషన్‌లో రాజకీయాలు, సిపారసులు జోరుగా సాగినట్లు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. సిపారసులు ఉన్న వారికి రూ.15వేల పింఛను వచ్చే విధంగా 85 నుంచి 100 శాతం వరకు వికలత్వం సమోదు చేయడం గమనార్హం. సదరం రీ వెరిఫికేషన్ జరిగే చోటుకు ఇతరులను అనుమతించడం లేదనేది ఉత్తుత్తిదేనని స్పష్టమవుతోంది.
కుట్రపూరితంగానే తొలగింపులు
తుగ్గలి: ఎన్నికల ముందు సంక్షేమ పథకాలతో ఊరించిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత కోతలు మొదలుపెట్టారు. దివ్యాంగులపై కనీస కనికరం లేకుండా అనర్హుల పేరిట ఎడాపెడా తొలగింపులకు పాల్పడుతుండటం విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో బాధిత దివ్యాంగులు ప్రసన్న, రామాంజినేయులు, గోవిందరాజులు, వీరాంజినేయులు సీపీఎం మండల కార్యదర్శి శ్రీరాములుతో కలిసి సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. 20 ఏళ్లుగా వస్తున్న తమ పింఛన్లను తొలగించడం అన్యాయమని వాపోయారు. కాళ్లు లేని వారు, మాటలు రాని వారు, కళ్లులేని వారు సర్కారుకు కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెరిఫికేషన్‌లో 70 శాతం వికలత్వం ఉన్నా పింఛన్లు తొలగించడం ఏంటని ప్రశ్నించారు. అర్హుల పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని, లేనిపక్షంలో కార్యాలయాలు, రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ ఎంపీడీఓ శ్రీహరికి వినతిపత్రం అందజేశారు.
కోడుమూరులోని 5వ సచివాలయం పరిధిలో ఓ వ్యక్తికి అన్ని అవయవాలు సవ్యంగానే ఉన్నాయి. అయితే రెండు వేళ్లు దెబ్బతిన్నాయి. ఇది వరకు ఈయనకు 50 శాతం వరకే వికలత్వం ఉంది. రూ.6వేల పింఛను తీసుకుంటున్నాడు. కాళ్లు, చేతులు బాగున్న ఇతను అన్ని పనులు సొంతంగానే చేసుకుంటున్నాడు. ఈయనకు సదరం రీ వెరిఫికేషన్‌లో ఏకంగా 90 శాతం వికలత్వం నమోదు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
రీ వెరిఫికేషన్
‘లోప’భూయిష్టం!

పుట్టుకతో చెవిటి, మూగ.. ఆపై మెదడులో సమస్య

పుట్టుకతో చెవిటి, మూగ.. ఆపై మెదడులో సమస్య

పుట్టుకతో చెవిటి, మూగ.. ఆపై మెదడులో సమస్య