
వైభవంగా ఈరన్న స్వామి పల్లకీ మహోత్సవం
కౌతాళం/కోసిగి: ఉరుకుంద ఈరన్న స్వామి పల్లకీ మహోత్సవం సోమవారం కనుల పండువగా సాగింది. తెల్లవారుజామున 4 గంటలకు ఉరుకుంద గ్రామంలోని ఈరన్నగౌడు ఇంటి వద్ద ఉన్న స్వామివారి పల్లకీకి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి పల్లకీని పాదయాత్రతో కోసిగి మండలం కందుకూరు వద్ద ఉన్న తంగభద్ర నదికి చేర్చారు. స్వామి విగ్రహానికి నదిలో జలాభిషేకాన్ని నిర్వహించి నది ఒడ్డున ప్రత్యేక పూజలు చేశారు. కోసిగి, మంత్రాలయం మండలాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి పల్లకీ మహోత్సవంలో పాల్గొన్నారు. కందుకూరు నుంచి పల్లకీ బయలుదేరి కామనదొడ్డి, తిప్పలదొడ్డి, కరణి, మల్లనహట్టి, చిరుతపల్లి గ్రామాల మీదుగా అడుగడుగాన పూజలందుకుంటూ ఉరుకుందకు పోలిమేరకు రాత్రి 7గంటలకు చేరుకుంది. అక్కడ స్వామి వారి పల్లకీకి మేళతాళలతో, బాణసంచలతో ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి, ప్రధాన, ఉపప్రధాన అర్చకులు, గ్రామపెద్దలు స్వాగతం పలకారు. పొలిమేర నుంచి దేవాలయానికి పల్లకీ చేరుకునేంత వరకు అడుగడుగునా టెంకాయాలను కొట్టారు. భక్తుల కోసం దేవాలయ అధికారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పల్లకీ దేవాలయంలో ప్రవేశించిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ కోసిగి మండల కన్వీనర్ బెట్టన్నగౌడ్, ఉరుకుంద ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ చెన్నబసప్ప, పలువురు నాయకులు పాల్గొన్నారు.

వైభవంగా ఈరన్న స్వామి పల్లకీ మహోత్సవం