
ఎస్సీ, ఎస్టీ మెరిట్ విద్యార్థినులకు కెనరా విద్యా జ్యోత
కర్నూలు(అర్బన్): కెనరా విద్యా జ్యోతి పథకం పేరుతో ప్రతి ఏడాది 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ మెరిట్ విద్యార్థినులను ఎంపిక చేసి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కెనరా బ్యాంకు కర్నూలు రీజినల్ మేనేజర్ సుశాంత్‌కుమార్ తెలిపారు. గురువారం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ బ్రాంచ్‌లో విద్యాజ్యోతి పథకం కింద ఎంపికై న విద్యార్థినులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కెనరా బ్యాంకు శాఖల ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాలికల విద్యాభివృద్ది దేశ ప్రాధాన్యత అయితే ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కెనరా బ్యాంకు కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే తులసీదేవి మాట్లాడుతూ.. కెనరా విద్యాజ్యోతి పథకం ద్వారా విద్యార్థినులను విద్యాపరంగా మరింత ప్రోత్సహించడంతో పాటు అమ్మాయిల భవిష్యత్తు నిర్మాణానికి తోడ్పడుతుందన్నారు. గతంలో పేద ప్రతిభావంతురాలైన ఎస్సీ విద్యార్థినికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక లాప్‌టాప్‌ను కూడా కెనరా బ్యాంకు అందించిందన్నారు. కార్యక్రమంలో డివిజినల్ మేనేజర్ సురేష్‌కుమార్, బ్రాంచ్ మేనేజర్ శంకర్, చైతన్య శివరాజ్ పాల్గొన్నారు.