
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కల్లూరు: 44వ జాతీయ రహదారి చిన్నటేకూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామానికి చెందిన వి. రాజు (31 ) దుర్మరణం చెందాడు. ఉలిందకొండ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కల్లూరు మండలం తడకపల్లె గ్రామంలో జరుగుతున్న మొహర్రం 40 రోజుల జార్తాలకు భార్య దుర్గ, మరో ఇద్దరితో కలిసి బైక్‌పై రాజు గురువారం వెళ్లాడు. మొక్కులు చెల్లించుకొని శుక్రవారం స్వగ్రామానికి బయలుదేరాడు. తడకనపల్లె క్రాస్ రోడ్డులో మోటర్ సైకిల్ ప్రమాదవశాత్తు అదుపు తప్పి రైలింగ్‌ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న రాజు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతా ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న నేషనల్ హైవే పెట్రోలింగ్ హెడ్ కానిస్టేబుల్ నూర్ అహమ్మద్, పోలీసులు వారిని 108లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గ్రానైట్ దుకాణంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
నందికొట్కూరు: పట్టణ సమీపంలోని మై హోమ్ గ్రానైట్ దుకాణంలోకి శుక్రవారం నందికొట్కూరు డిపోకు చెందిన ఆర్టీసీ బెంగళూరు సర్వీస్ దూసుకెళ్లింది. అయితే, ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి వస్తున్న ఈ బస్సులో డ్రైవర్ కలిముల్లాకు బీపీ డౌన్ అయింది. దీంతో స్టీరింగ్ పట్టు తప్పడంతో బస్సు గ్రానైట్ దుకాణంలోకి వెళ్లి బండలను ఢీకొట్టినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయలు కాలేదని వెల్లడించారు. కాగా బస్సు ఢీకొనంతో సుమారు రూ. 9 లక్షల విలువ చేసే గ్రానైట్ బండలు పగిలిపోయినట్లు గ్రానైట్ యజమాని సద్దాం తెలిపారు.
కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి
కర్నూలు(రూరల్): కుక్కల దాడి లో 15 గొర్రె పిల్లలు మృతి చెందాయి. మండల పరిధిలోని జి.సింగవరం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన బైరి పెద్ద మద్దిలేటి జీవాలు పెంచుతుంటాడు. శుక్రవారం గ్రామ సమీపాన కేసీ కెనాల్ వంతెన దగ్గర ఉన్న దొడ్డిలో గొర్రె పిల్లలను ఉంచి మందను మేతకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాదాపు 6 కుక్కలు దొడ్డిలొకి దూకి గొర్రె పిల్లలపై దాడికి తెగబడ్డా యి. ఈ ఘటనలో 15 పిల్లలు అక్కడికక్కడే మృతి చెందాయి. తర్వాత దొడ్డికి వచ్చి చూడగా గొర్రె పిల్లలు చనిపోయి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఘటనతో రూ.90 వేలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.
బైక్ అదుపు తప్పి..
ఆళ్లగడ్డ: అహోబిలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంతియాజ్ బాషా (24) అనే యువకుడు శుక్రవారం మృతి చెందాడు. నంద్యాల రూరల్ మండలం కానాల గ్రామానికి చెందిన ఇంతియాస్ బాషా ఓ శుభకార్యానికి అహోబిలం వచ్చాడు. మధ్యాహ్న సమయంలో దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలం వెళ్తుండగా మార్గమధ్యంలో మోటర్ సైకిల్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టింది. ఈఘటనలో ఇంతియాజ్ బాషా అక్కడికక్కడే మృతి చెందగా బైక్ వెనుక కూర్చున్న వెంకట సునీల్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వరప్రసాద్ తెలిపారు.