లారీని ఢీకొన్న ప్రైౖవేట్‌ బస్సు | - | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న ప్రైౖవేట్‌ బస్సు

Aug 8 2025 9:26 AM | Updated on Aug 8 2025 1:01 PM

బస్సు డ్రైవర్లకు గాయాలు

వెల్దుర్తి: కర్నూలు – బెంగళూరు జాతీయర రహదారిపై వెల్దుర్తి పట్టణ సమీపంలో గురువారం తెల్లవారుజామున ముందువెళ్తున్న లారీని ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ప్రమాదవశాత్తు ఢీకొంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న మార్నింగ్‌ స్టార్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు మార్గమధ్యలో వెల్దుర్తి సమీపంలో లద్దగిరి క్రాస్‌ రోడ్‌ హనుమాన్‌ జంక్షన్‌ వద్ద ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. 

జంక్షన్‌లో స్పీడ్‌ బ్రేకర్లను గమనించి లారీ డ్రైవర్‌ వేగం తగ్గించడంతో వెనుక వస్తున్న బస్సు డ్రైవరు అదుపు చేయలేక లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతినగా, డ్రైవర్‌ సిద్ధు విలాస్‌తో పాటు పక్కన కూర్చున్న మరో డ్రైవర్‌ అనిల్‌ గాయపడ్డారు. సంఘటనాస్థలికి చేరుకున్న హైవే పోలీసులు క్షతగాత్రులను 108లో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులు ఇతర బస్సులో తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు.

వైఎస్సార్‌సీపీ ‘మేధావుల’ కార్యదర్శిగా తిరుమలేశ్వర రెడ్డి

కర్నూలు (టౌన్‌): వైఎస్సా ర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మేధావుల ఫోరం కార్యదర్శిగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పాటిల్‌ తిరుమలేశ్వర రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రస్థాయి పదవి అప్పగించడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

నీటికుంటలో పడి వ్యక్తి మృతి

కొలిమిగుండ్ల: మండల కేంద్రం కొలిమిగుండ్లలోని జమ్మలమడుగు రోడ్డులో గురువారం నీటి గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు మేరకు.. కల్లూరుకు చెందిన లారీ డ్రైవర్‌ పీరా కుమారుడు చంద్‌బాషా (26)ను వెంట పెట్టుకొని ఈనెల 5వ తేదీన జమ్మలమడుగు క్రాస్‌ రోడ్డులోని లారీ ట్రాన్స్‌పోర్టు కార్యాలయం వద్ద బాడగ కోసం వేచి ఉన్నారు. రెండు రోజుల క్రితం నుంచి చాంద్‌బాషా కనిపించకపోవడంతో తండ్రితో పాటు తోటి డ్రైవర్లు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే పాలీస్‌ ఫ్యాక్టరీకి చెందిన నీటికుంటలో మృతదేహం కనిపించింది. సమాచారాన్ని పోలీసులకు అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మద్యం మత్తులో గుంతలో పడిపోయాడా.. ప్రమాదశాత్తూ పడిపోయాడా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మోసం చేశాడు.. న్యాయం చేయండి

దేవనకొండ: తనను మోసం చేశాడని ప్రియుడు ఇంటి ముందు ఓ యువతి దీక్ష చేపట్టింది. మండలంలోని పాలకుర్తి గ్రామానికి చెందిన స్వర్ణకుమారి పి.కోటకొండ గ్రామానికి చెందిన బండమీది రాజు ఐదేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. రాజుకు మరో యువతితో పెళ్లి సంబంధం చూస్తు న్నారు. ఈ విషయం తెలుసుకున్న స్వర్ణకుమారి గురువారం ఉదయం పి.కోటకొండకు చేరుకుని రాజు ఇంటి ఎదుట నిరాహార దీక్షకు పూనుకుంది. దీంతో యువకుడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. రాత్రయినా యువతి అక్కడే ఉంది. ఈ విషయంపై దేవనకొండ సీఐ వంశీనాథ్‌ను వివరణ కోరగా రాజు తనను మోసం చేశాడని 20 రోజుల క్రితం స్వర్ణకుమారి ఫిర్యాదు చేసిందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

లారీని ఢీకొన్న ప్రైౖవేట్‌ బస్సు 1
1/2

లారీని ఢీకొన్న ప్రైౖవేట్‌ బస్సు

మోసం చేశాడు.. న్యాయం చేయండి2
2/2

మోసం చేశాడు.. న్యాయం చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement