24 మందికి 60 టన్నుల యూరియా! | - | Sakshi
Sakshi News home page

24 మందికి 60 టన్నుల యూరియా!

Aug 8 2025 9:26 AM | Updated on Aug 8 2025 9:26 AM

24 మందికి 60 టన్నుల యూరియా!

24 మందికి 60 టన్నుల యూరియా!

కర్నూలు(అగ్రికల్చర్‌): ఒక బస్తా యూరియా లభించక సాధారణ రైతులు ఇబ్బందులు పడుతుంటే కొందరికి మాత్రం ఎంత కావాలంటే అంత లభిస్తోంది. జూలై నెలకు సంబంధించి జిల్లాలో 24 మంది అత్యధికంగా యూరియా వినియోగించడం గమనార్హం. వీరందరూ టీడీపీకి చెందిన వారే కావడంతో అంతటా చర్చనీయాంశమైంది. ఒక్కొక్కరు ఒక్క నెలలోనే రెండున్నర టన్నుల ప్రకారం వినియోగించినట్లు స్పష్టమవుతోంది. కేవలం 24 మంది పెద్ద రైతులు 60 టన్నుల యూరియను తరలించుక పోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతుంటే వచ్చిన యూరియా కూటమి పార్టీలకు చెందిన వారికి తరలుతుందనేందుకు ఇదే నిదర్శనం. 24 మందిపై విచారణ నిర్వహించాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. జిల్లాలో యూరియా కోసం రైతులు గగ్గోలు పెడుతున్నారు. దాదాపు అన్ని మండలాల్లో యూరియా కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం యూరియాతో సహా అన్ని రకాల రసాయన ఎరువులను ఈ–పాస్‌ మిషన్‌ల ద్వారానే ఆన్‌లైన్‌లో విక్రయించాలి. విక్రయించే ప్రతి బస్తా ఏ రోజుకారోజు ఆన్‌లైన్‌లో నమోదు కావాలి. అపుడే జిల్లాలో ఎరువుల నిల్వ ఎంత ఉందనేది తెలుస్తుంది. జిల్లాలో ప్రయివేటు డీలర్లు, రైతుసేవా కేంద్రాలు, పీఏసీఏస్‌లు, డీసీఎంఎస్‌ల్లో మాన్యువల్‌గానే యూరియా అమ్మకాలు సాగిస్తున్నారు. విక్రయించిన ఎరువుల వివరాలను తీరిక ఉన్నప్పుడు ఈ–పాస్‌ మిషన్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. అందువల్ల ఆన్‌లైన్‌లో ఎరువులు భారీగా కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఒక్క బస్తా కూడా లభించని పరిస్థితి ఏర్పడింది. ల్లాలో ఏలాంటి యూరియా కొరత లేదని కంపెనీ గోదాముల్లో 2,263 టన్నులు, హోల్‌సేల్‌ డీలర్ల దగ్గర 440, మార్క్‌ఫెడ్‌ దగ్గర 6,072, రీటైల్‌ డీలర్ల దగ్గర 2,527, రైతు సేవా కేంద్రాల్లో 1,112, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌ల్లో 428 టన్నుల ప్రకారం జిల్లాలో 12,842 టన్నుల ప్రకారం యూరియా ఉందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని జిల్లా వ్యవసాయ యంత్రాంగం జిల్లా కలెక్టర్‌కు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్‌ కూడా దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. ఆన్‌లైన్‌లో ఉన్న ఈ లెక్కలను చూసి యూరియా పుష్కలంగా ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం కర్నూలు జిల్లాకు కేటాయింపులు భారీగా తగ్గించేస్తోంది. దీంతో ఎరువుల కొరత ఏర్పడి సామాన్య రైతులు ఆందోళన బాటపడుతున్నారు.

కూటమి పార్టీల నేతలకు మాత్రం

పుష్కలంగా సరఫరా

సామాన్య రైతులకు దొరకని యూరియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement