ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే యూరియా కొరత | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే యూరియా కొరత

Aug 5 2025 7:15 AM | Updated on Aug 5 2025 7:15 AM

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే యూరియా కొరత

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే యూరియా కొరత

కలెక్టర్‌ పి.రంజిత్‌బాషాకు వినతిపత్రం ఇచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలు

కర్నూలు(సెంట్రల్‌): రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జిల్లాలో యూరియా కొరత ఏర్పడిందని వైఎస్సార్‌సీపీ ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆరోపించారు. జిల్లాలోని రైతులందరికీ యూరియాను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌బాషాను కలసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి.విరూపాక్షి మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వంలో అన్నదాత తీవ్రకష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఏ గ్రామంలో అక్కడే రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, మందులు, విత్తనాలను అందుబాటులో ఉంచి రైతులకు ఇబ్బంది లేకుండా చేసినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసిందన్నారు. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, మందులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతుండడంతో అన్నదాతలు అధిక రేట్లకు కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. తక్షణమే బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టేందుకు డీలర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. అధిక ధరలకు ఎరువులు, ఇతర మ ందులను అమ్మే వ్యాపారులపై లైసెన్స్‌లు రద్దు చేయాలన్నారు.

రూ.5 వేలు ఇచ్చి మోసం

పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తానని చెప్పి రూ.5 వేలు ఇచ్చి మోసం చేస్తున్నారని చెప్పారు. కేంద్రం ఇచ్చే సాయంతో సంబంధంలేకుండా రాష్ట్ర ప్రభుత్వమే రూ.20 వేలు ఇవ్వాలన్నారు. రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల భరత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ..ఉచిత పంటల బీమా ఇవ్వడం లేదని, పాలకులకు రైతుల ఉసురు తగులుతుందన్నారు. రైతు కన్నీరు కారిస్తే రాష్ట్రానికి మంచిది కాదన్నారు. రాష్ట్ర కార్యదర్శి సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ..అన్నదాత సుఖీభవలో 7 లక్షల మంది రైతులకు పరిహారం ఎగ్గొట్టడం తగదన్నారు. నాయకులు రాఘవేంద్రనాయుడు, షరీఫ్‌, మోహన్‌, రామాంజనేయులు, నరసింహారెడ్డి, సర్వేశ్వరరెడ్డి, నాగేంద్ర పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement