
సంక్షేమ విద్యార్థినులకు బంగారు పతకాలు
కర్నూలు(అర్బన్): కర్నూలులో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ అథ్లెటిక్స్ మీట్‌లో నగరంలోని నెంబర్ 1 ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు బంగారు పతకాలు సాధించడం గర్వ కారణమని కర్నూలు, నంద్యాల జిల్లాల సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారిణులు బీ రాధిక, చింతామణి అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పతకాలు సాధించిన విద్యార్థినులకు వారు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అండర్ 20 అథ్లెటిక్స్ మీట్‌లో జే అనిత 100 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్, లాంగ్ జంప్‌లో సిల్వర్ మెడల్ సాధించారన్నారు. అలాగే మరో విద్యార్థిని ఎం రజిత షార్ట్ పుట్, లాంగ్ జంప్‌లో గోల్డ్ మెడల్స్ సాధించారని చెప్పారు. సంక్షేమ శాఖ వసతి గృహాల్లోని విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా జాతీయ స్థాయిలో రాణించడం గర్వ కారణమన్నారు. హాస్టల్ విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న వసతి గృహ సంక్షేమాధికారి బీ బెన్నమ్మను వారు ప్రత్యేకంగా అభినందించారు. బంగారు పతకాలు సాధించిన విద్యార్థినులను వారు శాలువాలు కప్పి, సర్టిఫికెట్లను అందించి సన్మానించారు.