నేరాల నియంత్రణకు గ్రామాల్లో సీసీ కెమెరాలు
తుగ్గలి/మద్దికెర: నేరాల నియంత్రణకు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జొన్నగిరి, తుగ్గలి, మద్దికెర పోలీస్ స్టేషన్‌లను బుధవారం సాయంత్రం తనిఖీ చేశారు. స్టేషన్ల పరిధిలోని పెండింగ్ కేసులపై ఆరా తీశారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారి పట్ల కఠినంగా వ్యహరించాలని ఆదేశించారు. తరచూ నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటరామయ్య, రూరల్ సీఐ పులిశేఖర్, ఎస్‌ఐలు మల్లికార్జున, కృష్ణమూర్తి, విజయ్‌కుమార్‌నాయక్, సిబ్బంది ఉన్నారు.
వైద్య మందులపై తప్పుడు ప్రకటనలు ఇస్తే చర్యలు
● ఔషధ నియంత్రణ శాఖ ఏడీ రమాదేవి
కర్నూలు(హాస్పిటల్): ప్రజలను తప్పుదోవ పట్టించేలా వైద్య మందుల వినియోగంపై ప్రకటనలు ఇస్తే చర్యలు తీసుకుంటామని ఔషధ నియంత్రణ శాఖ ఏడీ రమాదేవి హెచ్చరించారు. బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ అధిక బరువు తగ్గిస్తామని, పలు రకాల వ్యాధులు నయం చేస్తామని సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చిన పలు సంస్థలపై ఇటీవల కేసులు నమోదు చేశామన్నారు. అందులో ఇండోర్‌కు చెందిన ఈమాన్ డ్రగ్స్, నందికొట్కూరుకు చెందిన వెంకటేశ్వరరెడ్డి, బనగానపల్లి మండలం బానుముక్కల గ్రామంలోని పక్షవాత నివారణ కేంద్రాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కర్నూలు నగరంలోని గణేష్‌నగర్ సమీపంలోని పార్థగ్రాండ్‌లో ఫిజీషియన్ శాంపిల్స్ అక్రమంగా నిల్వ ఉంచుకున్న ఉదయ్‌కుమార్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. ఇతనిపై ఇప్పటికే పలుమార్లు కేసులు ఉన్నట్లు తెలిపారు. అలాగే నంద్యాలలో శ్రీ వైష్ణవి మెడికల్స్‌పై డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి మత్తును కలిగించే మందులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశామన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(అర్బన్): సీ క్యాంప్‌లోని ప్రభుత్వ శారీరక వికలాంగుల వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్దుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్‌ఫాతిమా కోరారు. హాస్టల్‌లో 3వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇతర కోర్సులు చదివే విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తామని పేర్కొన్నారు. నిబంధనల మేరకు వంద మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు కార్యాలయ ఫోన్ నంబర్ 08518–277864ను సంప్రదించాలన్నారు.
ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం
కర్నూలు సిటీ: ఏపీ ఈఏపీ సెట్‌లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. కర్నూలులో ఏర్పాటు చేసిన తొమ్మిది కేంద్రాల్లో మొదటి రోజున ఉదయం 1,247 మందికి గాను 1,177 మంది, మధ్యాహ్న సెషన్‌లో 1,255 మందికి గాను 1,182 మంది హాజరయ్యారు. నంద్యాలలోని మూడు కేంద్రాల్లో మొదటి రోజు ఉదయం 544 మందికి గానూ 520 మంది, మధ్యాహ్నం 543 మందికి గానూ 523 మంది హాజరయ్యారు. ఈ నెల 27వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
తవ్వారు.. వదిలేశారు!
ఆదోని అర్బన్: పట్టణంలోని బసాపురం రోడ్డు మార్కెట్‌యార్డు సమీపంలో చిన్న వర్షానికి పెద్దదిగా గుంత మారి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. గత నెలలో ఈ రోడ్డులో పైపులైన్ లీకేజీ అయ్యి గుంత తవ్వారు. ఆ గుంతను అసంపూర్తిగా పూడ్చారు. దీంతో ఆ రోడ్డులో మార్కెట్‌యార్డు, పత్తి పరిశ్రమలకు వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారు. రెండు రోజుల లారీ గుంతలో ఇరుక్కుపోవడంతో ప్రొక్లెయిన్‌ను తీసుకొచ్చి బయటకు తీశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
నేరాల నియంత్రణకు గ్రామాల్లో సీసీ కెమెరాలు


