ప్రభుత్వ తీరు దారుణం
కర్నూలు(సెంట్రల్): పేదలకు ఇంటివద్దనే రేషన్ సరుకులు అందిస్తూ.. నిరుద్యోగులకు ఉపాధి అందిస్తూ ఉపయుక్తంగా ఉన్న ఎండీయూ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం దారుణమని ఆపరేటర్లు, హెల్పర్లు అన్నారు. కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న కోపంతో తమ కడుపులు కొడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట ఎండీయూ ఆపరేటర్లు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తమకు జీవనాధారమైన ఎండీయూ వాహనాలను కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎండీయూ ఆపరేటర్లు అక్బర్‌వలి, కేశవ్, మహ్మద్‌రఫీ, వీరేష్, శీను, మద్దిలేటి మాట్లాడుతూ.. రేషన్ సరుకుల డెలివరీ కోసం ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 2027 జనవరి వరకు ఎండీయూ వాహనాలను కొనసాగించాలన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నెలకు రూ.21 వేలు ఇచ్చేదని, ఇందులో రూ.3 వేలు బండి ఈఎంఐ పోను మిగిలిన రూ. 18 వేలలో రూ. 5 వేలు హెల్పర్‌కు, మరో రూ.3 వేలు పెట్రోలు, ఇతర నిర్వహణ చార్జీలకు ఖర్చు అయి రూ.10 వేలు మిగిలేదన్నారు. దానితో తాము ఉపాధి పొంది కుటుంబాలను పోషించుకునే వారమని తెలిపారు. వాటిని రద్దు చేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తమతో ప్రభుత్వం చేసుకున్న గడువు వరకు కొనసాగించాలని, ఆ తర్వాత ఇతర ప్రభుత్వ శాఖల్లో తమకు ఉపాధిని చూపాలన్నారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామన్నారు.
కలెక్టరేట్ ఎదుట
ఎండీయూ ఆపరేటర్ల ధర్నా


