
జిల్లాలో జీఎస్‌టీ వసూళ్లలో మెరుగుదల
● వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమిషనర్ సుధాకర్‌రావు
కర్నూలు(హాస్పిటల్): రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే కర్నూలు జిల్లాలో జీఎస్‌టీ వసూళ్లలో మెరుగుదల సాధించినట్లు వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమిషనర్ సుధాకర్‌రావు చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది ఏప్రిల్‌లో రూ.89.404 కోట్లు జీఎస్‌టీ రాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 99.55కోట్లు జీఎస్‌టీ వసూళ్లు వచ్చాయని, ఈ మేరకు 12 శాతం పెరుగుదల కనిపించిందని తెలిపారు. జిల్లాలో గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, మైనింగ్ తదితర కార్యకలాపాల వల్ల ఇది సాధ్యమైందని తెలిపారు. ఆన్‌లైన్‌లో జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో అక్రమాలు జరుగుతున్నాయని గమనించి గత నాలుగు నెలల నుంచి నేరుగా కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఈ మేరకు ప్రతి నెలా 200లకు పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో లాగా ఇప్పుడు తనిఖీలు చేసే విధానం మారిందన్నారు. ఇప్పుడు రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తేనే తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. రెగ్యులర్‌గా జీఎస్‌టీ అధికారులకు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించేలా డ్యూటీలు వేస్తారని, ఈ మేరకు వారు వాహనాలను తనిఖీలు చేస్తారన్నారు. జీఎస్‌టీ చెల్లించని, అక్రమంగా వస్తువులను రవాణా చేసే వాహనాలను పట్టుకుని సీజ్ చేస్తామని తెలిపారు. ఫెనాల్టీ చెల్లించని పక్షంలో వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. ఆ తర్వాత ఇలా స్వాధీనం చేసుకున్న వస్తువులను వేలం వేస్తామన్నారు. ఇటీవల ఆదోనిలో స్థానిక పోలీసులతో కలిసి ఓ బంగారు వ్యాపారి వద్ద అక్రమ బంగారా న్ని గుర్తించి రూ.9 లక్షలు జరిమానా విధించామని వివరించారు.