ఉపాధి పనుల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు
● డ్వామా పీడీ వెంకట రమణయ్య
ఆలూరు రూరల్: ఉపాధి పనుల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పని జిల్లా డ్వామా పీడీ వెంకట రమణయ్య ఉపాధి హామీ సిబ్బందిని హెచ్చరించారు. మండలంలోని పెద్దహోతూరు, ఆలూరు గ్రామ పంచాయతీల పరిధిలో చేపట్టిన ఉపాధి పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆన్‌లైన్ మస్టర్ తప్పుదారి పట్టించినా, ఒకే ఫొటోను ఇతర మస్టర్లలో అప్‌లోడ్ చేసినా.. పాత పనులనే కొత్త పనులుగా చూపుతూ మస్టర్లలో ఫొటోలు అప్‌లోడ్ చేస్తే సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లు, మేటీలు, టీఏలపై చర్యలు తప్పని చెప్పారు. నిర్దేశించిన పనుల లక్ష్యాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీఓ శ్రీనివాసులుకు సూచించారు. ఫాంపాండ్ పనులు వేగవంతం చేయాలన్నారు. జాబ్ కార్డు ఉన్న కూలీలకు వంద రోజుల పని కల్పించాలన్నారు. ప్రతి రోజు రూ.300 ఉపాధి కూలీ అందేలా పని చేయించాలని చెప్పారు. పని ప్రదేశంలో ఆన్‌లైన్ మస్టర్లు నమోదు చేయాలన్నారు. స్థానిక కసూర్బా గాంఽధీ పాఠశాలలో నిర్మించిన రూఫ్ వాటర్ గుంతను పరిశీలించారు. పని అంచనా, మెటీరియల్ కాంపోనెంట్ నిఽధులపై అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఉపాధి హామీ పథకం కింద మొక్కల పెంపకాన్ని పరిశీలించారు.


