కాళ్లు కదపలేక.. మెట్లు ఎక్కలేక!
పింఛన్ల పంపిణీ అభాసుపాలు
● ఇంటిదగ్గర పింఛన్ల పంపిణీ నామమాత్రమే ● అధిక శాతం సచివాలయాల వద్దే.. ● సర్వర్ పనిచేయక లబ్ధిదారుల పడిగాపులు
కర్నూలు(అగ్రికల్చర్): ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీ చేస్తామని ప్రభు త్వం చెప్పినా, క్షేత్రస్థాయిలో అభాసుపాలు అవుతోంది. సచివాలయ ఉద్యోగులు ఇళ్ల వద్దకు రాకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు ఇక్కట్ల పాలయ్యారు. నడకలేక, సచివాలయం మెట్లు ఎక్కలేక అవస్థలుపడ్డారు. చాలాచోట్ల రచ్చబండల దగ్గర పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. నివాసానికి 300 మీటర్ల దూరంలో పంపిణీ చేసే వెసులుబాటు కల్పించడంతో దాదాపుగా ఇంటి దగ్గర పింఛన్ల పంపిణీ నామమాత్రానికే పరిమితమైంది. సర్వర్ పనిచేయకపోవడంతో పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు పంపిణీ ముందుకు సాగని పరిస్థితి. ఇదిలాఉంటే జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కర్నూలు నగరంలోని సాయి బాబా సంజీవయ్య నగర్‌లో పింఛన్లు పంపిణీ చేశా రు. పంపిణీ తీరుతెన్నులపై ఆయన లబ్ధిదారులతో ఆరా తీశారు. సాయంత్రం 6 గంటల సమయానికి కర్నూలు జిల్లాలో 93.35 శాతం, నంద్యాల జిల్లాలో 92.02 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయింది.


