పోస్టాఫీసులో దొంగలు పడ్డారు | - | Sakshi
Sakshi News home page

పోస్టాఫీసులో దొంగలు పడ్డారు

Dec 5 2023 5:30 AM | Updated on Dec 5 2023 5:30 AM

రూ. 2.88 లక్షల నగదు అపహరణ

కోవెలకుంట్ల: స్థానిక ఆర్‌కే పెట్రోల్‌ బంకు ఎదురుగా ఉన్న పోస్టాఫీసులో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఎస్‌ఐ వెంకటరెడ్డి అందించిన సమచారం మేరకు.. గుర్తు తెలియని దుండగులు పోస్టాఫీస్‌ తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. ట్రెజరీ రూంలోని మనీ చెస్ట్‌లో భద్రపరిచిన రూ. 2.88 లక్షల నగదును అపహరించారు. సోమవారం ఉదయం సిబ్బంది విధులకు రాగా తాళం పగలగొట్టి ఉండటంతో లోనికి వెళ్లి పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించారు. సబ్‌ పోస్ట్‌మాస్టర్‌ గురువయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

చాగలమర్రిలో చైన్‌స్నాచింగ్‌

చాగలమర్రి: మండల కేంద్రమైన చాగలమర్రిలోని పాత ఎస్సీ కాలనీ సమీపంలో సోమవారం తెల్లవారుజామున చైన్‌స్నాచింగ్‌ జరిగింది. స్థానిక శ్రీనివాస నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న పి.లక్ష్మీదేవి భర్త రిటైర్డ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ పి.వెంకటసుబ్బయ్యతో కలిసి కార్తీకమాస పూజలకు శివాలయానికి బయలుదేరారు. చక్రపాణి థియేటర్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి లక్ష్మీదేవి మెడలో ఉన్న రూ.1.20 లక్షల విలువైన రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని చుట్టుపక్కల గాలించినా చైన్‌స్నాచర్‌ ఆచూకీ లభించలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ప్రేమ పేరుతో మోసం

కోవెలకుంట్ల: ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించిన యువకుడిపై సోమవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ వెంకటరెడ్డి అందించిన సమాచారం మేరకు.. అవుకు మండలం సంగపట్నం గ్రామానికి చెందిన వలి కోవెలకుంట్ల పట్టణంలో ఓ షాపులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. ఇదే షాపులో పనిచేస్తున్న పట్టణంలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న ఎస్టీ కులానికి చెందిన స్పందనతో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వలి ప్రేమించిన యువతితో కాకుండా మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు యత్నించగా ఆ వివాహాన్ని అడ్డుకుని బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. విచారణ జరిపిన పోలీసులు వలిపై చీటింగ్‌, ఎస్సీ, ఎస్టీ కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

ఐదు మెడికల్‌ షాపులు సీజ్‌

బొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మందుల విక్రయాలు జరుపుతున్న ఐదు మెడికల్‌ షాపులను సోమవారం విజిలెన్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ సీఐ సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ గత నెల 15న పట్టణంలోని పలు మెడికల్‌ షాపులపై దాడులు నిర్వహించామన్నారు. శ్రీనివాస సెంటర్‌లోని అపోలో మెడికల్‌ షాపు, ఆత్మకూరు బస్టాండ్‌ వద్దనున్న అపోలో మెడికల్‌ షాపు, గాంధీ చైక్‌ లోని ఆంధ్ర మెడికల్స్‌,బిస్మిల్లా మెడికల్స్‌, కాత్యాయని షాపుల్లో ఔషధ నియంత్రణ అధికారుల సమక్షంలో దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో 5 మెడికల్‌ షాపులకు సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకుని పరిశీలించామన్నారు. మందుల విక్రయాల్లో ప్రభుత్వ నిభంధనలకు విరుద్దంగా వ్రికయాలు జరిపినట్లు తేలడంతో ఆ ఐదు మెడికల్‌ షాపులను సీజ్‌ చేశామన్నారు. సీఐ సునీల్‌ కుమార్‌తో పాటు, సీఐ కేశవరెడ్డి, జౌషద నియంత్రణాధికారి ఖలందర్‌ పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ పెంచాలి

కర్నూలు(రాజ్‌విహార్‌): కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంచాలని కోరినట్లు కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తను పార్లమెంట్‌లో రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్‌, టెలి కమ్యూనికేషన్స్‌, సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్ట్‌ కింద పనిచేస్తున్న ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ పెంచాలని విన్నవించినట్లు పేర్కొన్నారు. అలాగే న్యాయవాదుల బిల్లు(సవరణ)–2023పై మాట్లాడి పూర్తి మద్దతు ప్రకటించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement