సామాజిక అంశాలపై అవగాహన ఉండాలి
ఆదోని సెంట్రల్: ప్రతి విద్యార్థి సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని మండల విద్యాధికారి రాంభూపాల్ రెడ్డి అన్నారు. సూచించారు. పురపాలక ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని గౌతమి ఇటీవల అమరావతిలో జరిగిన బాలల అసెంబ్లీ సమావేశంలో పాల్గొని తన ప్రతిభను చాటడంతో ఆదివారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం రూపొందించిన జీవ వైవిద్యం– ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం అనే క్యాలెండర్, లెటర్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున ఉపాధ్యాయులు సుధాకర్ బాబు, ప్రహ్లాద్, లోక్యనాయక్, సురేష్, కోటన్న తదితరులు కలసి విద్యార్థికి అందించి అభినందనలకు తెలిపారు.
నేటి నుంచి ఎఫ్‌ఎ–3 పరీక్షలు
ఆదోని సెంట్రల్: ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సోమవారం నుంచి ఎఫ్‌ఎ–3(ఫార్మెటివ్ అసెస్‌మెంట్) పరీక్షలు జరుగుతాయని మండల విద్యాధికారులు భూపాల్ రెడ్డి, శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ప్యాపిలి: పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శీను నాయక్ (34) మృతి చెందాడు. రోళ్లపాడు తండాకు చెందిన శీను నాయక్ సొంత పని నిమిత్తం ద్విచక్రవాహనంపై ప్యాపిలికి వచ్చాడు. పని ముగించుకుని వెళ్తుండగా పెద్దపొదిళ్ల అండర్‌పాస్ బ్రిడ్జిపై గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మీబాయి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్యాపిలి పోలీసులు తెలిపారు.
ఇద్దరు యూట్యూబర్‌లపై కేసు నమోదు
ఆదోని అర్బన్: పట్టణ శివారులోని ఆస్పరి రోడ్డులో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్‌లో మద్యం సేవించి హంగామా చేసిన ఇద్దరు యూట్యూబర్‌లపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి మద్యం సేవించి బిల్లు కట్టకుండా రెస్టారెంట్ వారిపైనే దుర్భాషలాడారని బార్ అండ్ రెస్టారెంట్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు యూట్యూబర్‌లు వీరేష్, ఉదయ్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
గడ్డివాముల దగ్ధం
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని మల్కాపురం గ్రామంలో ఆదివారం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని గంగాధర్ అనే రైతుకు చెందిన నాలుగు గడ్డివాములు దగ్ధమయ్యా యి. గడ్డివాములకు నిప్పంటుకుని పెద్దగా మంటలు చెలరేగటంతో గమనించిన గ్రామస్తులు మంటు ఆర్పేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాదాపు రూ. 2 లక్షల వరకు ఆస్తినష్టం వాటినట్లు బాధితుడు వాపోయాడు. బాధితుడిని ప్రభుత్వం అదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని చెన్నాపురం గ్రామ మలుపు సమీపంలో ఆదివారం బైక్ అదుపు కిందపడటంతో బాల చౌడప్ప అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. పట్టణంలోని వెంకటాపురం కాలనీకి చెందిన బాల చౌడప్ప మద్యం మత్తులో బైక్‌ను డ్రైవ్ చేసుకుంటూ ఆదోని వైపు వెళ్తుండగా చెన్నాపురం మలుపు సమీపంలో అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో పోలీస్ రోడ్ సేఫ్టీ వాహనంలో చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.
గొర్రెల యజమాని మృతి
బేతంచెర్ల: మండల పరిధిలోని రహిమానుపురం గ్రామానికి చెందిన గొర్రెల యజమాని బద్దల పెద్దయ్య (50) విద్యుదాఘాతానికి గురై మరణించాడు. పోలీసుల వివరాల మేరకు.. బద్దల పెద్దయ్య గొర్రెలు, ఆవులు మేపుకొని జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో శనివారం కొన్ని గొర్రెలు తప్పిపోవడంతో వెతకడానికి అంబాపురం గ్రామం వైపు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాద వశాత్తు పంట పొలంలో ఉన్న విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన గ్రామస్తులు చికిత్స నిమిత్తం బేతంచెర్లకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య భూలక్ష్మితో పాటు కొడుకు ప్రేమనాథ్, కుమార్తె విజయలక్ష్మి ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సామాజిక అంశాలపై అవగాహన ఉండాలి


