కమార్తె మాట వినలేదని తండ్రి బలవన్మరణం
కోడుమూరు రూరల్: అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె తన మాట వినలేదని తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. కోడుమూరులోని బీసీ కాలనీకి చెందిన కురువ శ్రీనివాసులు (49)కు ఇద్దరు భార్యలు. ఇందులో చిన్న భార్య సుంకులమ్మ కుమార్తె వేరే కులం అబ్బాయిని ప్రేమించి శనివారం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ప్రేమికులిద్దరూ ఆదివారం తెల్లవారుజామున కోడుమూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన తండ్రి కురువ శ్రీనివాసులు.. కుమార్తెను ఇంటికి రావాలంటూ బతిమిలాడాడు. తను ప్రేమించిన వాడిని కాదని రాలేనంటూ కుమార్తె తెగేసి చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి కురువ శ్రీనివాసులు థిమేట్ గుళికలు తిని అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం శ్రీనివాసులును కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా శ్రీనివాసులు కుమార్తె ప్రేమించిన అబ్బాయికి ఇంకా మైనార్టీ తీరకపోవడంతో పోలీసులు విచారించి ప్రేమికులిద్దరిని ఎవ్వరి ఇండ్లకు వారిని పంపించివేశారు.


