విజయా డెయిరీ వ్యవహారంలో కోర్టుకు వెళ్లింది తెలుగు తమ్ముళ్లే పాలకవర్గాన్ని రద్దు చేసి ఐఏఎస్‌ని నియమించాలని ఒక ఎమ్మెల్యే సూచన ఒంగోలు, చిత్తూరు డెయిరీ తరహాలో చేజిక్కించుకునేందుకు కుతంత్రం
కొలిక్కి రాని విజయ డెయిరీ వ్యవహారం
నాడు చిత్తూరు జిల్లాలో విజయవంతంగా అమలు చేసిన కుట్ర, కుతంత్రాలను ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అమలు చేసేందుకు ప్రభుత్వ పెద్ద రంగం సిద్ధం చేసినట్టు ఆరోపణలు వినవస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోనే అగ్రగామి డెయిరీలలో ఒకటైన విజయా డెయిరీని నిర్వీర్యం చేసే పన్నాగంలో భాగంగా ముందుగా మంత్రులను రంగంలోకి దింపి పాలకవర్గాన్ని రాజీనామా చేయించి కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటుచేశారని, తర్వాత తమ పార్టీ వ్యక్తితోనే కోర్టులో పిటీషన్ వేయించారని, ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని పాలకవర్గాన్ని రద్దు చేసి, ఐఏఎస్‌ను నియమించేందుకు కుట్ర జరుగుతోందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయ డెయిరీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. విజయ డెయిరీని నిర్వీర్యం చేయాలనే కుట్ర జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే హెరిటేజ్ డెయిరీ కోసం ఒంగోలు డెయిరీని, చిత్తూరు డెయిరీని నిర్వీర్యం చేసిన విధంగానే విజయ డెయిరీపై దృష్టి సారించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
విజయ డెయిరీకి వరుసగా మూడుసార్లు చైర్మన్‌గా ఎన్నికై న తమ పార్టీకే చెందిన చలసాని ఆంజనేయులును ఆగమేఘాలపై పదవి నుంచి దింపి వేసిన సంగతి తెలిసిందే. తమ ఆదేశాలను పాటించని సొంత పార్టీ నేతలను కూడా వదలకుండా వేధింపులకు పాల్పడటం ఒక ఎత్తయితే... తాజాగా కోర్టు తీర్పు, ప్రస్తుత చైర్మన్ పదవి గండానికి కూడా సొంత పార్టీ నేతే కారణం కావడం ఈ అనుమానాలను రెట్టింపు చేస్తోంది. 2022, 2023లో జరిగిన పాలకవర్గ ఎన్నికలను రద్దుచేయాలని కోర్టును ఆశ్రయించింది స్వయంగా తోట్లవల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శివరామ్ ప్రసాద్. అతని భార్య ప్రస్తుతం ఎంపీటీసీగా గెలిచి తోట్లవల్లూరు ఎంపీపీ రేసులో ఉన్నారు. తాను 2022, 2023 సంవత్సరాల్లో అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు, అప్పట్లో తనతో పాటు పోటీ చేసిన వారే నామినేషన్‌ను అనర్హుడిగా ప్రకటించారని అందుకే కోర్టును ఆశ్రయించానని చెబుతున్నారు. అధికార పార్టీ నేతగా ఉంటూనే పార్టీ ఏరికోరి నియమించిన చైర్మన్ దాసరి బాలవర్ధనరావు పదవి పోయేలా పోరాటం చేస్తుంటే అధిష్టానం ఎందుకు చూస్తూ ఊరుకుందని డైరెక్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దామనే విషయంలో కూడా పార్టీ ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న వైఖరి కూడా చర్చనీయాంశంగా మారింది. గురువారం ఈ అంశంపై చర్చ జరిగినప్పుడు ఒక ఎమ్మెల్యే మొత్తం పాలకవర్గాన్ని రద్దు చేసి ఐఏఎస్ అధికారితో విజయ డెయిరీని నడిపించాలని సూచించినట్లు సమాచారం. ఇదంతా చూస్తుంటే ఒక పథకం ప్రకారమే విజయ డెయిరీని నిర్వీర్యం చేసే కుట్రను ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి నడిపిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
లక్షా 50 వేల కుటుంబాలతో అనుబంధం
సుమారు ఐదు జిల్లాలలో పాలసేకరణ చేస్తూ లక్షా 50 వేల కుటుంబాల సంస్థగా విజయ డెయిరీగా పిలవబడే కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం (కృష్ణా మిల్క్ యూనియన్) నిలిచింది. ప్రస్తుతం ఏడాదికి రూ.1200 కోట్ల టర్నోవర్‌తో దక్షిణ భారతదేశంలోనే అగ్రగామి సహకార డెయిరీలలో ఒకటిగా నిలిచింది. పాలు, నెయ్యి, పెరుగుతో పాటు దాదాపు 84 రకాల పాల ఉత్పత్తులను ఈ డెయిరీ తయారు చేస్తోంది. బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో ఇటీవల తన రెండవ యూనిట్‌ను ప్రారంభించింది. ఈ కొత్త యూనిట్ ప్రతిరోజూ సుమారు 3 లక్షల లీటర్ల పాలు, లక్ష లీటర్ల పెరుగును ఉత్పత్తి చేస్తోంది. రైతుల నుంచి ప్రతిరోజూ 10 లక్షల లీటర్ల పాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త ఫ్యాక్టరీపై దృష్టి పెట్టిన ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేయడం ద్వారా హెరిటేజ్ హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మ్యాక్స్ చట్టంలోకి మారిన విజయ డెయిరీ విస్తరణ దిశగా ముందుకు పోతోంటే దీన్ని దెబ్బకొట్టాలనే ప్రయత్నం గత కొంతకాలంగా జరుగుతోంది. దీంతో పాలకవర్గం తమ చేతుల్లోనే ఉన్నప్పటికీ దాన్ని దశలవారీగా దెబ్బతీసే ప్రయత్నాలు ప్రభుత్వం వైపు నుంచి ముమ్మరం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే నేరుగా విజయ డెయిరీ వ్యవహారాల్లో మంత్రులను రంగంలోకి దింపిందన్న అనుమానాలకు తాజాగా జరుగుతున్న పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి.
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ది కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ)లో ఐదుగురు బోర్డు డైరెక్టర్ల ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు సృష్టం చేసిన వ్యవహారంలో ఎటువైపు అడుగులు వేయాలో విజయ డెయిరీ యాజమాన్యం తేల్చుకోలేకపోతోంది. విజయ డెయిరీ ఎండీ కొల్లి ఈశ్వరబాబు, 9 మంది బోర్డు డైరెక్టర్లు బుధవారం మరో మారు అత్యవసర సమావేశ మయ్యారు. మంగళవారం బోర్డు కోరం లేక వాయిదా పడగా, బుధవారం అదే 9 మంది డైరెక్టర్లు ఎండీతో సమావేశమయ్యారు. బుధవారం కూడా మంగళవారం నాటి పరిస్ధితులే నెల కొన్నాయి. ఈ వ్యవహారంపై మాక్స్ చట్టం, కో ఆపరేటివ్ చట్టంలోని బైలాతో పాటు న్యాయ నిపుణులు, బైలాను రూపొందించిన నిపుణుల సూచనలు, సలహాల మేరకు ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరో వైపున సుప్రీం కోర్టుకు వెళ్లాల్సి వస్తే దానికి అవసరమైన ఆర్థిక వనరులు, ఇతర పరిస్థితుల గురించి కూడా చర్చ సాగింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎంత కాలంలోగా బోర్డు నిర్ణయం తీసుకోవాలి, ఎన్నికలు నిర్ణయించాలంటే ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలను చర్చించారు. కృష్ణా మిల్క్ యూనియన్‌లో ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని మాజీ చైర్మన్ చలసాని ఆంజనేయులు బహిరంగంగా పేర్కొనడం గమనార్హం.
మీడియాను అనుమతించని యాజమాన్యం
విజయ డెయిరీ పరిపాలనా భవనంలో జరుగుతున్న బోర్డు డైరెక్టర్ల సమావేశానికి మీడియాకు అనుమతి లేదంటూ యాజమాన్యం పేర్కొంది. మీడియా ప్రతినిధులను ప్రధాన గేటు బయటే ఆపేయడం గమనార్హం. బోర్డు డైరెక్టర్ల సమావేశానికి సంబంధించి వివరాల కోసం దాదాపు మూడు గంటల పాటు ఎండలోనే వేచి ఉండాల్సి వచ్చింది. సమావేశం గురించి ఎటువంటి వివరాలను యాజమాన్యం తెలపకపోగా, ఫోన్ చేసి అడిగితే సమావేశంలో ఎటువంటి పురోగతి లేదని పేర్కొన్నారు.


