దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు

Nov 19 2026 12:43 PM | Updated on Nov 19 2026 12:43 PM

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు దూరవిద్య పది, ఇంటర్‌కు నెలాఖరు వరకు అవకాశం పీహెచ్‌సీలు తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ నిత్యావసరాల పంపిణీలో నిరంతరాయంగా సేవలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.94 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం మహామండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 21 రోజులకు గాను అమ్మవారి ప్రధాన ఆలయం, ఆలయ ప్రాంగణంలోని హుండీల ద్వారా రూ.3,94,31,637 కోట్ల నగదు లభించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. లభించిన ఆదాయంలో రూ.3,77,11,637 నోట్లుగాను, రూ.17.20 లక్షలు నాణేలుగా వచ్చాయన్నారు. 321 గ్రాముల బంగారం, 3.190 కిలోల వెండి లభించినట్టు ఆలయ ఈవో శీనానాయక్‌ పేర్కొన్నారు. కానుకల లెక్కింపును ఆలయ ఈవోతో పాటు ఏసీ రంగారావు, ఏఈవో ఎన్‌.రమేష్‌బాబు, చంద్రశేఖర్‌, దేవదాయ శాఖ అధికారులు పర్యవేక్షించారు. లెక్కింపులో ఆలయ సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొన్నారు.

పెడన: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్య ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాలకు రూ.200 జరిమానాతో ఈ నెలాఖరు వరకు అవకాశం ఉందని కృష్ణాజిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ ఎ.విజయలక్ష్మి తెలిపారు. పెడనలోని బంగ్లా స్కూల్‌ వద్ద గల మండల విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మధ్యలో చదువు మానివేసిన, నిలిపివేసిన వారు దూరవిద్యా విధానం ద్వారా చదువు కొనసాగించడం వలన వారి భవిష్యత్తుకు బంగారు బాట అవుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఈవో– 2 వై.హరనాథ్‌, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం దూర విద్య ఆవశ్యకతపై ప్రచార కరపత్రాలను ప్రదర్శించారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం, ఊటుకూరు పీహెచ్‌సీలను బుధవారం డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎ.శ్రావణ్‌బాబు సందర్శించారు. ఈ సందర్భంగా వాటిలో అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలును క్షుణ్ణంగా పరిశీలించారు.సిబ్బంది హాజరు వివరాలు, రోగుల నమోదు రిజిస్టర్లను తనిఖీ చేశారు. లాబొరేటరీని సందర్శించి రోజువారీగా నిర్వహిస్తున్న రక్త పరీక్షల సంఖ్య, రక్త నమూనాల సేకరణ, పరీక్షల ఫలితాలను రోగులకు సకాలంలో అందిస్తున్నారా లేదా అనే విషయాలను పరిశీలించారు. ఫార్మసీలో మందుల లభ్యత, రోగులకు పంపిణీ చేస్తున్న మందుల వివరాలు, స్టాక్‌ రిజిస్టర్లు పరిశీలించారు. మందుల గడువు తేదీలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు.

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లాలోని ప్రజలకు నిత్యావసర సరుకులతో పాటు గ్యాస్‌ సిలిండర్లు, పెట్రోల్‌, డీజిల్‌ నిరంతర సరఫరా చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి పి.శివరామప్రసాద్‌ ఆదేశించారు. ఆయన తన కార్యాలయంలో బుధవారం గ్యాస్‌ డీలర్లు, పెట్రోల్‌ బంకుల యజమానులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ డీకె బాలాజీ ఆదేశాల మేరకు అక్వాన్‌ తుపాను నేపథ్యంలో జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కొరత ఏర్పడకుండా తగిన నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తుపాను కారణంగా సరఫరా వ్యవస్ధకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించటం, అధిక ధరలకు విక్రయించటం వంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement