జీజీహెచ్‌ డైటీషియన్‌ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌ డైటీషియన్‌ సస్పెన్షన్‌

Nov 19 2026 12:37 PM | Updated on Nov 19 2026 12:37 PM

‘కడుపారా కల్తీ’ వార్తపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ విచారించి చర్యలు తీసుకోవాలంటూ సీఎఫ్‌డబ్ల్యూకి ఆదేశం డైటీషియన్‌ను సస్పెండ్‌ చేస్తూ బుధవారం డీఎంఈ ఆదేశాలు డైట్‌ కాంట్రాక్టర్‌పై కూడా చర్యలు తీసుకునే అవకాశం

లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘సాక్షి’ దినపత్రికలో ఈ నెల 16న ప్రచురితమైన ‘కడుపారా కల్తీ’ కథనంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ స్పందించారు. ఆ కథనంలో విజయవాడ జీజీహెచ్‌లో రోగులకు పెట్టే డైట్‌ తయారీ వద్ద అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొనడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే రాష్ట్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ కమిషనర్‌(సీఎఫ్‌డబ్ల్యూ) చక్రధరబాబును పిలిచి ఈ అంశం మీ దృష్టికి వచ్చిందా, ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. వెంటనే దీనిపై విచారించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.

డీఎంఈ ఆకస్మిక తనిఖీ

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఆదేశాల మేరకు సీఎఫ్‌డబ్ల్యూ ఆ అంశాన్ని రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్‌ విష్ణువర్థన్‌కు తెలియజేశారు. దీంతో ఆయన మంగళవారం సాయంత్రం ప్రభుత్వాస్పత్రి డైట్‌ తయారీ చేసే ప్రాంతాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఆ సమయంలో సైతం అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించి సీరియస్‌ అయ్యారు. ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉంటే మీరేం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులు తనిఖీ చేసి, కాంట్రాక్టరుకు నోటీసులు ఇచ్చిన అంశాన్ని సైతం అధికారుల దృష్టికి తీసుకు రాక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

డైటీషియన్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు

జీజీహెచ్‌లోని డైట్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీరియస్‌ అవడంతో పాటు, ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులు ఇచ్చిన నోటీసుల అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడం, కిచెన్‌లో అపరిశుభ్ర వాతావరణాన్ని డీఎంఈ గుర్తించడంతో డైటీషియన్‌ సయ్యద్‌ అక్బర్‌ బాషాను సస్పెండ్‌ చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. రోగులకు నాసిరకం ఆహారం పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్న డైట్‌ కాంట్రాక్టర్‌పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement