చిలకలపూడి(మచిలీపట్నం): ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీ వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామని కృష్ణాజిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ భారత ఎన్నికల సంఘం అధికారులకు తెలిపారు. భారత ఎన్నికల సంఘ సీనియర్ డెప్యూటీ ఎన్నికల కమిషనర్లు పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితా తయారీ పురోగతిపై వర్చువల్ విధానంలో సమీక్షించారు. ఈ సమీక్షలో కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2021వ సంవత్సర తుది ఓటర్ల జాబితాలో 3,085 మంది ఓటర్లు నమోదయ్యారని, ప్రస్తుతం 2,751 దరఖాస్తులు అందాయని వివరించారు. గతంలో నమోదైన ఓటర్ల సంఖ్యతో పోలిస్తే సుమారు 300 మంది తక్కువగా ఉన్నారని, క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ సమయంలో ఈ వ్యత్యాసాన్ని అధిగమించేందుకు కృషి చేస్తామన్నారు. దరఖాస్తుల పరిశీలనకు సుమారు 1,800 పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని నిబంధనలకు అనుగుణంగా క్షుణ్ణంగా పరిశీలించి, చట్టబద్ధంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని పలు విద్యాసంస్థలు విజయవాడ పరిధికి సమీపంలో ఉండటంతో, కృష్ణాజిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో కొందరు విజయవాడలో నివాసం ఉండే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఓటర్ల నమోదు వివరాలను మరోసారి సమగ్రంగా పరిశీలించి క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రక్రియలో అర్హులైన ఓటర్లు అదనంగా నమోదయ్యేలా చర్యలు చేపడతామని కలెక్టర్ వివరించారు. కాన్ఫరెన్స్‌లో అసిస్టెంట్ కలెక్టర్ నమ్రత అగర్వాల్, డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి, డీఈవో యూవీ సుబ్బారావు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.


