అక్వాన్‌ తుపానుపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

అక్వాన్‌ తుపానుపై అప్రమత్తం

Nov 19 2026 12:37 PM | Updated on Nov 19 2026 12:37 PM

ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి కలెక్టర్‌ డీకే బాలాజీ

చిలకలపూడి(మచిలీపట్నం): అక్వాన్‌ తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. కలెక్టర్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ తో కలిసి బుధవారం సాయంత్రం ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులతో వర్చువల్‌ విధానంలో సమీక్ష నిర్వహించారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సూచనలు చేశారు. ప్రస్తుత వాతావరణ అంచనాల ప్రకారం జిల్లాపై తుపాను ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని భావిస్తున్నప్పటికీ, గతంలో తుపానుల దిశ, ప్రభావిత ప్రాంతాల అంచనాలు చివరి దశలో మారిన సందర్భాలను దృష్టిలో ఉంచుకుని అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. రానున్న రెండు రోజుల పాటు అధికారులు, మండల స్థాయి సిబ్బంది తమ హెడ్‌ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలన్నారు. పరిస్థితులు మారితే తక్షణమే స్పందించేలా రిలీఫ్‌ కేంద్రాలను గుర్తించి, అక్కడ ఆహారం, తాగునీరు, వంట ఏర్పాట్లు, మరుగుదొడ్లు తదితర సదుపాయాల కల్పనకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. రహదారులపై చెట్లు పడిపోతే, విద్యుత్‌ స్తంభాలు, లైన్లకు నష్టం వాటిల్లితే వెంటనే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించేలా విద్యుత్‌ శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్స్యకారులు ఇప్పటికే సురక్షితంగా తిరిగి వచ్చినట్లు సమాచారం ఉన్నప్పటికీ, మత్స్యశాఖ అధికారులు తమ సిబ్బందిని, మండల స్థాయి అధికారులను అప్రమత్తంగా ఉంచాలన్నారు. తుపాను దిశ, ప్రభావంపై గురువారం సాయంత్రం నాటికి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని, అప్పటి పరిస్థితులను బట్టి తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. ఈ సమీక్షలో డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి, ఆర్డీవోలు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement