కూలిన చెట్ల తొలగింపు, ముంపు నీటి తోడకం పేరుతో స్వాహాకు రంగం సిద్ధం ఒక్కో ఏఈకి రూ.10 లక్షల ఖర్చుకు ముందస్తు అనుమతి దీంతో అధిక రేట్లు చూపుతూ ఆయిల్ ఇంజిన్లు, జేసీబీలు, ట్రాక్టర్లు వాడుతూ బిల్లులు వచ్చే అక్వాన్ తుపానుకు కూడా అడ్వాన్సులు ఎంత అవసరమో తెలియజేయాలని కమిషనర్ మెసేజ్‌లు
మచిలీపట్నం టౌన్: వరుస తుపాన్లతో జన జీవనం అస్తవ్యస్తమై ఓవైపు ఇబ్బందులు పడుతుంటే.. ఇవే తుపాన్లు మచిలీపట్నం నగరపాలక సంస్థ అధికారులకు మాత్రం పండుగలా మారుతున్నాయి. అత్యవసర పనుల పేరుతో నగర పాలక సంస్థలోని కీలక అధికారులు, ఇంజినీ రింగ్ విభాగంలోని ఇంజనీర్లు అందిన కాడికి దోచుకునేందుకు సిద్ధమయ్యారు. తుపాన్ల కారణంగా కురిసిన వర్షాలకు ముంపు ప్రాంతా ల్లోని నీటిని తోడేందుకు ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు, కూలిన చెట్లు, విరిగి పడిన చెట్ల కొమ్మలను తొలగించేందుకు జేసీబీలు, ట్రాక్టర్ల నిర్వహణ పేరుతో లక్షలాది రూపాయలు స్వాహా చేసేందుకు సన్నద్ధమయ్యారు.
ఐదుగురు ఏఈలకు రూ.10 లక్షల అడ్వాన్సులు
నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న ఐదుగురు ఏఈ లకు అర్నబ్, మురసు తుపాన్ల నేపథ్యంలో అత్యవసర పనుల నిర్వహణకు గాను కమిషనర్ బాపిరాజు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున అడ్వాన్సులను ఇచ్చారు. ఈ మొత్తాలతో ఏఈలు వారి పరిధిలోని డివిజన్లలో ఉన్న ముంపు ప్రాంతాల్లో నీటిని తోడించేందుకు, చెట్లు, చెట్ల కొమ్మలను తొలగించడం వంటి పనులు చేపట్టారు. ఏఈలు ముంపు నీరు తోడే ఆయిల్ ఇంజినుకు రోజుకు రూ.10 వేల ఖర్చును చూపినట్లు తెలుస్తోంది. గూడూరు ప్రాంతం నుంచి ఆయిల్ ఇంజిన్లను రోజుకు రూ.3 వేలకే తెచ్చినట్లు చర్చ జరుగుతోంది. చెట్లను, చెట్ల కొమ్మలను తొలగించేందుకు నగరపాలక సంస్థకు చెందిన మూడు జేసీబీలు, ట్రాక్టర్లనే వినియోగించి ప్రైవేటు వాటిని వినియోగించుకుని మరీ బిల్లులు చేసుకున్నట్లు తెలుస్తోంది. కీలక అధికారి, ఇంజినీర్లు కుమ్మక్కై ఈ నిధుల స్వాహాకు పథకం రచించినట్లు తెలుస్తోంది. అడ్వాన్సులు తీసుకున్న రూ.50 లక్షల్లో సగమైనా ఖర్చు చేశారా..? లేదా అని నగర వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే అక్వాన్ తుపానుకు సైతం అడ్వాన్సులు
గురు, శుక్రవారాల్లో రానున్న అక్వాన్ తుపానుకు కూడా ఎవరికి ఎంత అడ్వాన్స్‌లు కావాలో తెలియజేయాలంటూ కమిషనర్ బాపిరాజు అధికారిక వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టడాన్ని చూస్తుంటే స్వాహా పర్వం మరింత పెంచేందుకేనా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. మళ్లీ ఒక్కో ఏఈ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అవసరమని అడ్వాన్సులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు అనుకుంటున్నారు. నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఈ అడ్వాన్స్‌ల పనులపై విచారణ జరిపి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని నగర వాసులు కోరుతున్నారు.


