కార్తిక ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

కార్తిక ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

Nov 6 2026 2:20 AM | Updated on Nov 6 2026 2:20 AM

కార్తిక ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక మాసోత్సవాలు, భవానీ దీక్షల నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్ల్లు చేయాలని దుర్గగుడి ఈఓ శీనానాయక్‌ సంబంధిత అధికారులకు సూచించారు. దుర్గగుడి మహా మండపం నాల్గో అంతస్తులోని సమావేశ మందిరంలో ఆలయ వైదిక కమిటీ బాధ్యులు, ఏఈఓలు, సూపరింటెండెంట్లతో ఈఓ గురువారం ప్రత్యే కంగా సమావేశమయ్యారు. ఈ నెల పదో తేదీ నుంచి ప్రారంభమయ్యే కార్తికమాసం, 11వ తేదీన జరిగే గాజుల ఉత్సవం, 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే భవానీ దీక్షలపై డీఈఓ కిషోర్‌కుమార్‌, ఏసీ రంగారావు, స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, వైదిక కమిటీ సభ్యుడు శంకర శాండిల్య, ఏఈఓలు రమేష్‌బాబు, చంద్రశేఖర్‌, సుధారాణి, గంగాధర్‌, తిరుమలేశ్వర రావు, లక్ష్మీప్రసన్న, ఈఈ ఎల్‌.రమా, డీఈఈలతో చర్చించారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు మంచి దర్శనం కల్పించడంతో పాటు వారికి అమ్మవారి అన్నప్రసాదం, లడ్డూప్రసాదం, పులిహోర ప్రసాదంను అందించాలని సూచించారు. అదే విధంగా స్నానఘాట్‌లో క్లోక్‌రూమ్‌, చెప్పుల స్టాండ్‌తో పాటు దుస్తులు మార్చుకునేందుకు గదులలో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో సోషల్‌ మీడియా ద్వారా దుర్గమ్మ అలంకారాలు, ఇతర పూజా కార్యక్రమాలను 2.29 కోట్ల మంది వీక్షించారని దుర్గగుడి ఈఓ శీనానాయక్‌ పేర్కొన్నారు. 1.18 కోట్ల మంది దేవస్థానం అధికార ఖాతాలతో పాటు ఇతర సోషల్‌ మీడియా ద్వారా మరో 1.11 కోట్ల మంది ఈ ఉత్సవాలను వీక్షించారని పేర్కొన్నారు. దేవస్థానం పరిధిలో లీజుదారులు, లైసెన్సుదారులు ఆలయ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఈఓ శీనానాయక్‌ సృష్టం చేశారు. దేవస్థానం లీజెస్‌ విభాగం ఏసీ రంగారావు, ఏఈఓ రమేష్‌బాబు, లక్ష్మీ ప్రసన్నలతో సమీక్ష సమావేశం నిర్వమించారు. ఆయా దుకా ణాలు, కౌంటర్లలో దేవస్థానం నిర్ణయించిన ధరలకే సేవలను అందించేలా చూడాలన్నారు. దేవస్థానం నిర్వహిస్తున్న క్లోక్‌రూమ్‌, చెప్పుల స్టాండ్‌ల వద్ద ఎటువంటి లోపాలు తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement