రైతుబజార్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు | - | Sakshi
Sakshi News home page

రైతుబజార్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

Nov 7 2026 1:54 AM | Updated on Nov 7 2026 1:54 AM

రైతుబజార్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు డాక్టర్‌ చిత్రకు అరుదైన గౌరవం తిరుపతమ్మ ఆలయంలో కార్తిక మాస అలంకరణలు ఎస్‌ఆర్‌ఆర్‌లో ముగిసిన అంతర్జాతీయ సదస్సు

ఇబ్రహీంపట్నం: రైతుబజార్ల అభివృద్ధి, రైతులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని రైతుబజార్ల రాష్ట్ర సీఈఓ మాధవీలత పేర్కొన్నారు. మైలవరం, ఇబ్రహీంపట్నం రైతుబజార్లను శుక్రవారం మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రైతుబజార్లలోని సదుపాయాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా తీశారు. రైతుబజార్లలో రైతులకు, వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు అదనపు షెడ్లు, కార్యాలయ గది, మరుగుదొడ్ల నిర్మాణానికి అవసరమైన అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ఆమె వెంట మార్కెటింగ్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ దివాకర్‌, మార్కెటింగ్‌ డీఈ ప్రసాద్‌, ఏఈ రామకృష్ణ, రైతుబజార్‌ ఎస్టేట్‌ అధికారి అజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఈ నెల 1 నుంచి మూడు రోజుల పాటు జరిగిన జాతీయ అనాటమీ వైద్యుల సదస్సులో ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలకు చెందిన డాక్టర్‌ చిత్ర రామస్వామికి అరుదైన గౌరవం దక్కింది. ఆ సదస్సులో విశిష్ట ఆహ్వాన వక్తగా, ప్యానెల్‌ చర్చకు అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఆమె ఆటల ఆధారిత వినూత్న బోధనా పద్ధతుల ద్వారా వైద్య విద్యార్థుల్లో ఆసక్తి, చురుకై న అభ్యాసనం, జ్ఞాపకశక్తి, విశ్లేషణాత్మక ఆలోచనా సామర్థ్యాలను పెంపొందించే విధానాలపై సదస్సులో ప్రసగించారు. జాతీయ సదస్సులో అరుదైన గుర్తింపు దక్కించుకున్న డాక్టర్‌ చిత్ర రామస్వామిని శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆలపాటి ఏడుకొండలరావు ప్రత్యేకంగా అభినందించారు. అధ్యాపకుల విద్యా, పరిశోధనా వృత్తిపరమైన అభివృద్ధికి కళాశాల తరఫున నిరంతరం ప్రోత్సాహం, సహకారం అందిస్తామని ఆయన తెలిపారు.

పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో కార్తిక మాసంలో ప్రతి ఆదివారం ప్రత్యేక అలంకరణ చేస్తామని ఆలయ ఈఓ నూతక్కి వెంకట సాంబశివరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15న అమ్మవారి ప్రధానాలయంలో పూల అలంకరణ, 22న పసుపు కొమ్ములతో విశేష అలంకరణ, 24న దీపాలంకరణ, అలాగే కార్తిక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6.30 నిమిషాలకు మునేటి తీరంలో నదీ హారతులు, కార్తిక దీపోత్సవం కార్యక్రమం ఉంటుందన్నారు. 29న పండ్లతో అలంకరణ, డిసెంబర్‌ 6న గాజుల అలంకరణ చేస్తారన్నారు.

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): మాచవరం ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల ఐసీ నేచర్‌ 2026 అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. దేశ విదేశాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఐదు సాంకేతిక సెషన్‌లలో పాల్గొని ఆధునిక పరిశోధనలు, నూతన సాంకేతిక పరిజ్ఞానంపై ప్రసంగించారు. అమెరికాలోని స్ట్రాటజిక్‌ ఫార్మా సొల్యూషన్స్‌ సంస్థ ఔషధ ఉత్పత్తుల అభివృద్ధి నిపుణుడు డాక్టర్‌ మహేంద్ర శ్రీరామోజు ‘శాసీ్త్రయ నైపుణ్యం నుంచి కృత్రిమ మేధస్సు ఆధారిత నిర్ణయాల దిశ’ అనే అంశంపై మాట్లాడారు. ఔషధ పరిశోధన అభివృద్ధిలో ఏఐ ప్రాముఖ్యతను వివరించారు. ఒమన్‌లోని సుల్తాన్‌ ఖాబూస్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ రంగరాజ్‌ సెల్వరాజ్‌, హైదరాబాద్‌ సీఎస్‌ఐఆర్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్‌ టి. విక్రమ్‌సాగర్‌, పోలాండ్‌ సైలేసియన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ ప్రొఫెసర్‌ యాదగిరి బొమ్మరమోని, దక్షిణ కొరియాలోని యోంగ్నామ్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ డాక్టర్‌ మధుసూధనరావు మాట్లాడారు. విద్యార్థులు, పరిశోధకులకు మౌఖిక పరిశోధన ప్రదర్శనలు, పోస్టర్‌ ప్రదర్శన పోటీలు నిర్వహించారు. సదస్సులో 224 మంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement