ఇష్టానుసారంగా మందుల ధరలు ఎమ్మార్పీ, ఇన్వాయిస్ రేట్ల మధ్య భారీ వ్యత్యాసం ఇటీవల సుప్రీంకోర్టు సైతం సీరియస్ అయినప్పటికీ మారని వైనం ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఇబ్బందులు పట్టించుకోని ప్రభుత్వాలు
క్యాన్సర్ రోగులు వాడే ఇమాటినిబ్ 400 ఎంజీ(10 బిళ్లలు): ఇన్‌వాయిస్ ధర రూ.450 కాగా ఎంఆర్‌పీ రూ.2,300
కొలెస్ట్రాల్‌కు వాడే ఒక కంపెనీ మందులు(10 బిళ్లలు): ఇన్‌వాయిస్ ధర 43, ఎంఆర్‌పీ రూ.203
పాంటప్రజోల్ (15 బిళ్లలు): ఇన్‌వాయిస్ ధర రూ. 20 నుంచి రూ.30 వరకూ, ఎంఆర్‌పీ రూ.140 నుంచి రూ.170
ఇవే ఉదాహరణలు..
రోగుల ప్రాణాలతో బిజినెస్ చేస్తున్న వ్యాపారులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): మందుల విక్రయాల్లో కంపెనీలు, వ్యాపారులు ప్రజలను దగా చేస్తున్నారు. ఒక మందు వాస్తవ ధర కంటే ఐదారు రెట్లు అధికంగా ఎంఆర్‌పీ ముద్రిస్తూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. అందుకు ఇన్వాయిస్ ధరకు, ఎంఆర్‌పీకి మధ్య ఉన్న వ్యత్యాసమే నిదర్శనంగా చెప్పవచ్చు. సాధారణ వ్యాధులకు వాడే మందులతో పాటు, ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్‌కు వాడే మందుల విషయంలో సైతం ఎంఆర్‌పీ నియంత్రణ ఉండటం లేదు. దీంతో మందులు కొనుగోలు చేసే వారు దగా పడుతున్నారు. ఈ విషయంలో ఇటీవల సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ఇన్‌వాయిస్ రేట్లకు, ఎంఆర్‌పీకి 5 నుంచి 10 రెట్లు అధికంగా ఉండటంపై కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయినప్పటికీ ప్రైస్ కంట్రోల్ బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేక పోవడంతో ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు.
పెరిగిన మందుల వాడకం..
ఆధునిక జీవన శైలిలో చిన్న వయస్సులోనే వ్యాధుల బారిన పడుతున్నారు. మధ్య వయస్సు 40 ఏళ్లు దాటే నాటికి సుగర్, బీపీ వంటి వ్యాధులతో పాటు, గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. అలాంటి వారంతా జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. మందుల ధరల్లో నియంత్రణ లేకపోవడంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు నెలకు రూ.2 వేల నుంచి రూ .5 వేల వరకూ ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే ధరలపై నియంత్రణ, వాస్తవ ధరకు మందులను అమ్మితే అంత ఖర్చు అయ్యే అవకాశం ఉండదు.
మందుల షాపుల నుంచి ఆస్పత్రి వరకూ..
రోగి నుంచి వసూలు చేసే కన్సల్టేషన్ ఫీజు, ఇన్వెస్టిగేషన్స్‌తో పాటు మందుల అమ్మకాన్ని సైతం లాభార్జనగా చేసుకున్నారు. కంపెనీల నుంచి నేరుగా మందులు కొనుగోలు చేస్తూ, ఎంఆర్‌పీ ధరలకు విక్రయించడం ద్వారా లాభాలు పొందుతున్నారు. ఇలా మందులపై 40 శాతం నుంచి 70 శాతం వరకూ మార్జిన్ ఉంటున్నట్లు చెబుతున్నారు.
రోజుకు రూ.20 కోట్లకు పైగా వ్యాపారం..
నగరంలోని ఆస్పత్రులు, రిటైల్‌మందుల షాపుల ద్వారా రోజుకు రూ.20కోట్లకు పైగానే వ్యాపారం జరుగుతుంది. మందులపై యావరేజ్ 50 శాతం మార్జిన్ లెక్కిస్తే దాదాపు రూ.10 కోట్లు దోపిడీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగుల నుంచి దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదు. చివరికి సుప్రీం కోర్టు ఇన్‌వాయిస్, ఎంఆర్‌పీ ధరలపై ఇటీవల సీరియస్ అయింది. తక్షణమే మార్పు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ మార్పు వస్తుందో రాదో చూడాల్సి ఉంది.
ఇలా కంపెనీని బట్టి ఇన్‌వాయిస్, ఎంఆర్‌పీ రేట్లు మారుతూ ఉంటాయి. కానీ మార్జిన్ మాత్రం అంతే ఉంటుంది.


