కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ | - | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌

Nov 7 2026 1:54 AM | Updated on Nov 7 2026 1:54 AM

కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ పరిషత్‌ పోరులో తీర్పు నేడే

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 26 జెడ్పీటీసీ, 343 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జిల్లాలో 9 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు అభ్యర్థుల్లో టెన్షన్‌.. టెన్షన్‌

పరిషత్‌ పోరులో తీర్పు నేడే

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. శనివారం జిల్లాలోని 26 జెడ్పీటీసీ స్థానాలు, 343 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థుల గెలుపు, ఓటముల కోసం ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపునకు జిల్లాలో పలు ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ కేంద్రాల్లో టేబుల్స్‌ వారీగా లెక్కింపు ప్రక్రియకు అధికారులు సన్నద్ధం చేశారు. గురువారం జరిగిన పోలింగ్‌ ప్రక్రియలో జిల్లాలో 9,98,055 మంది ఓటర్లకుగానూ 7,30,494 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఓటర్లు ఎవరి గెలుపునకు అవకాశం ఇచ్చారో బ్యాలెట్‌ బాక్సుల రూపంలో బయటకు రానుంది.

ఓట్ల లెక్కింపు ఇలా..

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అధికారులు సిద్ధం చేశారు. మొదటిగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకున్న వారి పత్రాలను తీసి వాటి లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం జెడ్పీటీసీ, ఎంపీ టీసీ స్థానాలకు ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ల బ్యాలెట్‌ పత్రాలను లెక్కింపు కేంద్రాలకు తీసుకువచ్చి జెడ్పీటీసీ, ఎంపీటీసీ విడివిడిగా వేసిన బ్యాలెట్‌ పత్రాలను వేరు చేయనున్నారు. అనంతరం 25 చొప్పున బ్యాలెట్‌ పత్రాలను కట్టలు కట్టి ఆయా సెగ్మెంట్ల కోసం ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాలకు పంపిణీ చేసి ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.

లెక్కింపు కేంద్రాలు ఇవే..

మచిలీపట్నం నార్త్‌, సౌత్‌, పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలు కృష్ణా యూనివర్సిటీ, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి మండలాలకు అవనిగడ్డలోని డిగ్రీ, జూనియర్‌ కళాశాలలో, ఘంటసాల మండలం ఘంటసాల జెడ్పీ హైస్కూల్‌లో జరగనుంది. గన్నవరం మండలం సెయింట్‌ జాన్స్‌ హైస్కూల్‌లో, గుడివాడ, బాపులపాడు, ఉంగుటూరు, గుడ్లవల్లేరు, పెదపారుపూడి గుడివాడలోని వీకేఆర్‌, వీఎన్‌బీ కళాశాలలో, పెనమలూరు, కంకిపాడు మండలాలు పెనమలూరులోని ధనేకుల ఇంజినీరింగ్‌ కళాశాలలో, ఉయ్యూరు, తోట్లవల్లూరు మండలాలు ఉయ్యూరులోని వీఆర్‌కేఎం పాఠశాలలో, మొవ్వ, పామర్రు, పమిడిముక్కల మండలాలు మొవ్వలోని డిగ్రీ కళాశాలలో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. జిల్లాలోని తొమ్మిది కేంద్రాల్లో 519 టేబుళ్లను ఏర్పాటు చేసి లెక్కింపు ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి 3,348 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు.

సిబ్బంది నియామకం..

జిల్లాలోని కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు పటిష్ట పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు ఏఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, ముగ్గురు రిజర్వు ఇన్‌స్పెక్టర్లు, 57 మంది ఎస్‌ఐలు, 173 మంది ఏఎస్‌ఐలు, హోంగార్డులు, 317 మంది కానిస్టేబుళ్లు, 149 మంది హోంగార్డులతో పాటు స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ కోసం 110 మందిని అదనంగా నియమించారు.

సిబ్బందికి దిశానిర్దేశం..

శనివారం రాత్రి మచిలీపట్నంలోని క్యాంపు కార్యాలయం నుంచి రిటర్నింగ్‌ అధికారులు, ప్రత్యేకాధికారులు తదితర సిబ్బందితో కలెక్టర్‌ డీకే బాలాజీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన విధివిధానాలపై సూచనలు చేశారు. తొలుత జాయింట్‌ కలెక్టర్‌ ఎం. నవీన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ నమ్రతా అగర్వాల్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా లెక్కింపు ప్రక్రియ అంశాలను వివరించారు.

సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్న

ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు

గుడివాడరూరల్‌: స్థానిక వీకేఆర్‌ వీఎన్‌బీ ఇంజినీరింగ్‌ కళాశాలలో జరగనున్న ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్‌ డీకే బాలాజీ శుక్రవారం పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు అధికారులు, సిబ్బందికి కలెక్టర్‌ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సమయంలో అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. గుడివాడ ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

ఓట్ల లెక్కింపునకు పటిష్ట భద్రత

గుడివాడ వీకేఆర్‌ వీఎన్‌బీ ఇంజినీరింగ్‌ కళాశాలను డీఎస్పీ పాలా శ్రీనివాస్‌తో కలసి శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ పి.విద్యాసాగర్‌ నాయుడు పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించి లెక్కింపు సమయంలో పోలీసు అధికారులు, సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలను వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సమయంలో ఎటువంటి గొడవలు, ఘర్షణలకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టామన్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు కూడా ఓట్ల లెక్కింపు సమయంలో నిబంధనల ప్రకారం నడుచుకుని తమకు సహకరించాలని ఎస్పీ కోరారు. సీఐలు కొండపల్లి శ్రీనివాస్‌, కె.హనీష్‌, ఎస్‌ఎల్‌ఆర్‌ సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement