పారదర్శకంగా నిర్వహిద్దాం.. సహకరించండి | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా నిర్వహిద్దాం.. సహకరించండి

Oct 30 2026 7:24 AM | Updated on Oct 30 2026 7:24 AM

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

తిరువూరు: పురపాలక సంఘ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ కోరారు. గురువారం కలెక్టర్‌ తిరువూరు మునిసిపల్‌ కార్యాలయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటర్లను పరిశీలించారు. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరువూరు పట్టణంలో బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు జారీచేయాలని, గడువులోగా స్లిప్పుల పంపిణీ జరిగే విధంగా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. సెయింట్‌ ఆన్స్‌ స్కూల్లోని పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. తిరువూరు వాహినీ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలోని స్ట్రాంగ్‌ రూం, ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన సూచనలిచ్చారు. తిరువూరు రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఏ కుమార్‌, తహసీల్దార్‌ చంద్రమౌళి, మునిసిపల్‌ కమిషనర్‌ మనోజ ఆయన వెంట ఉన్నారు.

అన్నదాతలకు ప్రభుత్వ చేయూత..

తిరువూరురూరల్‌: అర్నబ్‌ తుపాను కారణంగా జిల్లాలో వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన సహాయ సహకారాలందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. గురువారం తిరువూరు మండలం మల్లేల గ్రామంలో తుపాను కారణంగా పంటలకు కలిగిన నష్టాన్ని స్థానిక అధికారులతో కలసి ఆయన పరిశీలించారు. పొలాల్లో నిలిచిపోయిన నీటిని తొలగించి వెంటనే పంటలను కాపాడుకోడానికి వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలను రైతులు పాటించాలని కలెక్టరు కోరారు. రైతులు అడిగిన వెంటనే తగు సలహాలు, సూచనలందించి పంటనష్టం తగ్గించేందుకు కృషిచేయాలని అధికారులకు సూచించారు. ఆర్డీవో కుమార్‌ కూడా కలెక్టర్‌ వెంట ఉన్నారు. లక్ష్మీపురంలో తాగునీటి సరఫరా తీరును పరిశీలించిన కలెక్టర్‌ కలుషితం కాని రక్షిత నీరందించడానికి చర్యలు తీసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు ఆదేశాలిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement