వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి డిమాండ్
మధురానగర్(విజయవాడసెంట్రల్): రిటైర్డు పోలీసు అధికారి, విజయవాడ మేయర్ స్వతంత్య్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు తనపై చేసిన నిరాధార ఆరోపణలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేని పక్షంలో తాను తీసుకునే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి హెచ్చరించారు. స్థానిక సత్యనారాయణపురం భగత్‌సింగ్ రోడ్డులోని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కార్యాలయంలో గురువారం ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ నాయకులతో కలిసి మాట్లాడారు. విధి నిర్వహణలో ఆరోపణలతో సస్పెండ్ అయ్యిన ఏబీ వెంకటేశ్వరరావు తనపై రౌడీషీట్ ఉందని.. తాను ఒక కబ్జాకోరునంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నాలుగు సార్లు కార్పొరేటర్‌గా, మూడు సార్లు సీపీఐ ఫ్లోర్ లీడర్‌గా పనిచేసిన తనపై ఏ విధమైన రౌడీ షీట్ లేదనే విషయం విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన తనకు తెలియదా అని ప్రశ్నించారు. తాను కొనుగోలు చేసిన స్థలంపై పలువురు ఉన్నతాధికారులు విచారణ నిర్వహించి.. సక్రమమేనని తెలిపినప్పటికీ, కబ్జాకోరు అంటూ నిరాధార ఆరోపణలు చేయటం రాజకీయ ఎత్తుగడలో భాగమేనని విమర్శించారు.
ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు..
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు సెక్షన్ 5,7, 8,21 ప్రకారం వ్యక్తిగత దూషణలు చేయకూడదని కానీ ఏబీ వెంకటేశ్వరరావు తనపై నిరాధారంగా వ్యక్తిగత దూషణలు చేశారన్నారు. దీనిపై తాను ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశానని గౌతం రెడ్డి తెలిపారు. వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సాయిరామ్ మాట్లాడుతూ ఏబీ వెంకటేశ్వరరావు గురించి విజయవాడ వాసులందరికీ తెలుసునని ఆయన హయాంలో 49 కిలోల బంగారం చోరీ జరిగితే కేవలం తొమ్మిది కిలోలు మాత్రమే రికవరీ చూపించారని.. తక్కిన బంగారం ఏమైందో ఏబీకే తెలియాలన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ మహిళా కార్యదర్శి ఇస్సంశెట్టి ఉషాజ్యోతి మాట్లాడుతూ ఒక ఉన్నత పోలీసు అధికారిగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు తన స్థాయిని మరచి మాట్లాడటం సరికాదన్నారు. కార్యక్రమంలో బెజవాడ బార్ అసోసియోషన్ మాజీ అధ్యక్షుడు చంద్రగిరి విష్ణువర్ధన్‌రావు, లీగల్‌సెల్ సభ్యుడు నిర్మల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


