పెనుగంచిప్రోలు: మండల కేంద్రం పెనుగంచిప్రోలులో ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులుగా తల్లీకూతుళ్లు దేరంగుల మహాలక్ష్మి, రేణుక పోటీ చేస్తున్నారు. పెనుగంచిప్రోలు ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వు అయింది. ఈ క్రమంలో పెనుగంచిప్రోలు రెండో సెగ్మెంట్ నుంచి మహాలక్ష్మి, నాలుగో సెగ్మెంట్ నుంచి రేణుక ఎన్నికల బరిలో ఉన్నారు. జనరల్ వార్డుల్లో పోటీలో ఉన్నా.. బడుగు, బలహీన వర్గాల నుంచి వారికి విశేష స్పందన లభిస్తోంది.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సంకట హర చతుర్థిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో గురువారం గణపతికి విశేష అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని పాత యాగశాలలో తొలుత గణపతి ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం అలంకరణ, పూజల తర్వాత గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. సంకట హర చతుర్థి రోజున స్వామి వారిని పూజించడం వల్ల జాతకంలో దోషాలు తొలగిపోయి, చేపట్టిన పనుల్లో ఇబ్బందులు తొలగి, అన్ని పనులలో విజయం లభిస్తుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. పలువురు ఉభయదాతలు, భక్తులు పాల్గొనగా, సేవల అనంతరం అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లో అనుమతించారు.
మధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ఫ్రభుత్వ డిగ్రీ కళాశాలలో వచ్చేనెల 5, 6వ తేదీల్లో ఐసీ అండ్ నేచర్ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భాగ్యలక్ష్మి అన్నారు. గురువారం అంతర్జాతీయ సదస్సు కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సదస్సు పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ సమస్యలకు వినూత్న పరిష్కారాలపై శాసీ్త్రయ చర్చలకు వేదికగా నిలవనుంది అన్నారు. పర్యావరణహిత సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, అంతర్శాఖా పరిశోధనలు, సుస్థిర భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించిన అంశాలపై చర్చ లు జరగనున్నట్లు ప్రిన్సిపాల్ వివరించారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): చైనా లోని జింగ్షాన్లో జరుగుతున్న 5వ ప్రపంచ జూనియర్ సాఫ్ట్ టెన్ని స్ చాంపియన్షిప్–2026లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడకు చెందిన ఏఎస్ వైశాలి, తమిళనాడుకు చెందిన తనికా తాయుమానవన్ సత్తా చాటారు. బాలికల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించారు. అంతర్జాతీయ వేదికపై తమ ప్రతిభను చాటుతూ భారతదేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకువచ్చిన వైశాలి, తనికాలను ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ ఏ.రవినాయుడు, ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ చైర్మన్ డి.నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి డి.దిలీప్ కుమార్, అధ్యక్షుడు వి.శ్రీనుబాబు, కోశాధికారి బి.నీరజ అభినందించారు.
విజయవాడలీగల్: విజయవాడలోని ఒక వృద్ధుడిని డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి రూ.10.25కోట్లు దోచుకున్న కేసులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న ముగ్గురు నిందితుల రిమాండ్ గురువారం ముగిసింది. నిందితులు అనిష్ఖాన్, ముజఫర్ రెహ్మాన్, ఐజర్ అలంను పోలీసులు వర్చువల్గా విజయవాడ జిల్లా కోర్టు నుంచి 3 ఏసీజేఎం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి వచ్చే నెల 12వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేసులో ముగ్గురు నిందితులను నాలుగురోజులపాటు పోలీసు కస్టడీకి అనుమతించగా, మూడో రోజు కస్టడీలో పోలీసులు వివరాలు రాబట్టినట్లు సమాచారం.
దేరంగుల రేణుక
దేరంగుల మహాలక్ష్మి


