పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మొగల్రాజపురంలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాన్ని గురువారం ఎన్నికల పరిశీలకురాలు ఎస్. నాగలక్ష్మి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కోసం చేపట్టిన ఏర్పాట్లు, ఓటింగ్ ప్రక్రియ, వారికి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు అవకాశం ఉందని అర్హులైన ఎన్నికల సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన, మేయర్ రిటర్నింగ్ అధికారి, పీడీ హౌసింగ్ రజిని కుమారి పాల్గొన్నారు.
గురువారం పోలైన ఓట్లు..
గురువారం జరిగిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌లో మొత్తం 440 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 183 మంది మహిళా ఓటర్లు కాగా 257 మంది పురుష ఓటర్లు ఉన్నారు.
సర్కిల్ వారీగా..
● సర్కిల్–1 పరిధిలోని 31 నుంచి 58 డివిజన్లకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 96 మంది ఓటు హక్కు వినియోగించుకోగా వారిలో 43 మంది మహిళా ఓటర్లు, 53 మంది పురుష ఓటర్లు ఉన్నారు.
● సర్కిల్–2 పరిధిలోని 1, 59 నుంచి 86 డివిజన్లకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 143 మంది ఓటర్లు పాల్గొనగా వారిలో 60 మంది మహిళా ఓటర్లు, 86 మంది పురుష ఓటర్లు పాల్గొన్నారు.
● సర్కిల్–3 పరిధిలో 2 నుంచి 30 డివిజన్లకు మొత్తం 201 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా వారిలో 80 మంది పురుష ఓటర్లు ఉండగా, 121 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కొడాలి(ఘంటసాల): మండలంలోని కొడాలి నుంచి విజయవాడ వెళ్లే ప్రధాన రహదారిపై బ్యాటరీ(ఎలక్ట్రిక్) ద్విచక్ర వాహనం దగ్ధమైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. కొడాలి గ్రామంలో పెట్రోల్ బంక్ దాటిన తర్వాత మధ్యాహ్నం సమయంలో బ్యాటరీ ద్విచక్ర వాహనం మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఆ సమయంలో ద్విచక్ర వాహనానికి సంబంధించిన వ్యక్తులు ఎవరూ లేరు. ఈ విషయమై ఘంటసాల పోలీసులను సంప్రదించగా బ్యాటరీ ద్విచక్ర వాహనం ప్రధాన రహదారిపై కాలిపోతున్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లగా బాధితులు ఎవరూ లేకపోవడంతో ఈ ప్రమాదంలో ఎవరికి ఇబ్బంది కలగలేదని, వాహనాన్ని పక్కకు తొలగించినట్లు చెప్పారు.


