విజయవాడ కల్చరల్: తిరుమల తిరుపతి దేవస్థానం, లబ్బీపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో తయాహ్నిక సంపూర్ణ వేదపారాయణం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల వేద పండితులు రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాన్ని పారాయణం చేశారు. ఈ కార్యక్రమం పర్యవేక్షకుడు గుళ్లపల్లి చినఆంజనేయులు మాట్లాడుతూ.. వేదాలు భారతీయ సనాతన ధర్మానికి ప్రతీక లని అన్నారు. వేదాలను పరిరక్షించుకోవడం మన ధర్మమని వివరించారు. టెంపుల్ ఇన్‌చార్జి డాక్టర్ ఆర్.రామ్మోనరావు మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ వేద పారాయణం జరుగుతుందని తెలిపారు.
కొండపల్లి(ఇబ్రహీంపటం): ఎన్టీఆర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల వ్యయ పరిశీలకుడు బి.విజయ్ కుమార్ గురువారం కొండపల్లిలో పర్యటించారు. స్థానికంగా ఏర్పాటుచేసిన స్టాటిస్టిక్ సర్వైలెన్స్ టీమ్ (ఎస్‌ఎస్‌టీ)ల కార్యకలాపాలను పరిశీలించారు. దొనబండ చెక్ పోస్టును పరిశీలించి వాహనాల్లో నగదు రవాణా, వాహన తనిఖీల వివరాలు తెలుసుకున్నారు. కొండపల్లి మునిసిపల్ కార్యాలయంలో వ్యయ పరిశీలన బృందాల పనితీరుపై ఆరా తీశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగు ణంగా ప్రతి అభ్యర్థి ఎన్నికల వ్యయాన్ని పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు, మద్యం, బహుమతులు వంటి ఇతర వస్తువుల పంపిణీ జరగకుండా ఎస్‌ఎస్‌టీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని విజయ్ కుమార్ స్పష్టం చేశారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విశాఖపట్నంలోని గీతమ్ డీమ్డ్ యూనివర్సిటీ ఆవరణలో ఈ నెల 31 నుంచి నవంబర్ రెండో తేదీ వరకు నిర్వహించే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ పురుషుల టోర్నీకి కృష్ణా యూనివర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించే జట్టును గురువారం ఎంపిక చేశారు. కేవీఎస్‌ఆర్ సిద్ధార్థ కాలేజీ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌కు చెందిన వి.జస్వంత్‌రాజ్, కె.వి.వి.ఎల్.రామ్ కుమార్, జి.హర్షవర్ధన్ (స్టాండ్‌బై), ఎస్‌వీడీ సిద్ధార్థ లా కళాశాలకు చెందిన డి.ఖాసీంను జట్టు సభ్యులుగా, టీమ్ మేనేజర్‌గా ఎ.చినబాబును ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులను మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఫార్మశీ కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ ఎ.సునీత, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): భారతీయ రైల్వేలోని పలు సెక్షన్లలో జరుగుతున్న నిర్వ హణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ గురువారం ప్రకటించింది. ఈ నెల 29వ తేదీన సికింద్రాబాద్ – హౌరా (12704), సికింద్రాబాద్ – భువనేశ్వర్ న్యూ (17016), షాలీమార్ – చర్లపల్లి (18045) రైళ్లను రద్దు చేశారు. చర్లపల్లి – షాలీమార్ (08046) రైలు ఈ నెల 31వ తేదీన రద్దయింది. ఎంజీఆర్ చైన్నెసెంట్రల్ – హౌరా (12840), ఖరగ్‌పూర్ – విల్లుపురం (22603), భువనేశ్వర్ న్యూ – సీఎస్‌టీ ముంబై (11020) రైళ్లు ఈ నెల 29న, షాలీమార్ – చర్లపల్లి (08045) ఈ నెల 30న, చర్లపల్లి – షాలీమార్ (08046) ఈ నెల 31న పూర్తిగా రద్దు చేశారు.


