కపటధారి! | - | Sakshi
Sakshi News home page

కపటధారి!

Oct 2 2026 7:38 AM | Updated on Oct 2 2026 7:38 AM

కపటధారి! బెడిసికొట్టిన కూటమి ఎన్నికల స్టంట్‌

బీసీలకు మరోమారు చంద్రబాబు వెన్నుపోటు బీసీ రిజర్వేషన్లపై సర్కారుకు హైకోర్టు షాక్‌ చట్ట సవరణ అంశాలను జీవోలతో కప్పిపుచ్చిన ప్రభుత్వం బీసీలపై సర్కారు చిత్తశుద్ధిపై సర్వత్రా విమర్శలు

చిత్తశుద్ధి అంటే వైఎస్సార్‌ సీపీదే..

పార్లమెంట్‌లో చట్టం చేయాలి

పటమట(విజయవాడతూర్పు)/చిలకలపూడి (మచిలీపట్నం): రాష్ట్ర జనాభాలో అధికంగా ఉండే వెనుకబడిన తరగతులు(బీసీ)పై ప్రభుత్వం మరోమారు తమ కపట వైఖరిని ప్రదర్శించింది. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వారికి గుర్తుకువచ్చే బీసీ రిజర్వేషన్‌ పెంపుదల అంశంలో చిత్తశుద్ధి బహిర్గతమైంది. స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్‌ను పెంచి సీట్లు కేటాయిస్తామని గత ఆగస్టులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రకటించారు. అందుకు అనుగుణంగా రెండు జీవోలను కూడా తీసుకువచ్చారు. అయితే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం దీనిపై గురువారం కీలకతీర్పు వెల్లడించింది. బీసీలకు గ్రామీణ ప్రాంతాల్లో 34శాతం, పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థలకు 33.33శాతం రిజర్వేషన్‌లను కల్పిస్తామని తీసుకువచ్చిన జీవోలను కొట్టివేసింది.

సమాచారం సేకరించటంలో విఫలం..

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌ పెంపుదల, ఖరారుకు సీనియర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌రంజన్‌ ఆధ్వర్యంలో బీసీ డెడికేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బీసీల వెనుకబాటు తనంపై అనుభవపూర్వక విచారణ, వారి రిజర్వేషన్‌ పెంచే ప్రక్రియ చేయటమే ఈ కమిషన్‌ ఉద్దేశం. ఇది సెప్టెంబర్‌ 30 వరకు పనిచేసింది. అయితే కమిషన్‌ పూర్తిస్థాయిలో నివేదికలు ఇవ్వలేదని, సరైన సమాచారం సేకరించటంలో విఫలమైందని, క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే ప్రభుత్వం సమర్పించిన నివేదికలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని నివేదికను సిద్ధం చేసిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఆ నివేదిక కూడా తప్పుల తడకగా ఉందని, ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా నివేదిక హడావుడిగా ప్రభుత్వానికి సమర్పించారని ఆరోపిస్తున్నారు.

సుప్రీంకోర్టులో సాధించగలరా?

బీసీ రిజర్వేషన్‌ పెంపుదల అంశంపై హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉందని సమాచారం. అయితే కేంద్రంలో కూడా ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఉంది కనుక రిజర్వేషన్‌ 50 శాతానికి మించి పెంచే అవకాశంపై చట్ట సవరణ చేయాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తడి తీసుకు వచ్చి బీసీల కోసం చట్ట సవరణ చేయించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని బీసీ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

2011 జనాభా లెక్కల ప్రకారం..

2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 17.35 లక్షల మంది ఉండగా వీరిలో సుమారు 15 లక్షల వరకు వెనుకబడిన వర్గాల వారు ఉన్నారు. 139 ఉపకులాల వారిని బీసీలుగా ప్రస్తుతం పరిగణిస్తున్నారు. ప్రముఖంగా బీసీ సామాజికవర్గంలో యాదవ, గౌడతో పాటు ఇతర ఉపకులాల వారు ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్న వీరికి ప్రభుత్వాలు ఎంతో చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ ఉపకులాల వారికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లను నియమించారు.

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఓసీ సామాజిక వర్గానికి కేటాయించినప్పటికీ గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ పదవిని ఉప్పాల హారికకు ఇచ్చి బీసీలపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. 2021లో వీఎంసీకి జరిగిన ఎన్నికల్లో మేయర్‌ పదవి జనరల్‌ మహిళా కేటగిరీకి కేటాయించారు. వైఎస్సార్‌ సీపీ మేయర్‌గా బీసీ సామాజికవర్గానికి చెందిన రాయన భాగ్యలక్ష్మిని నియమించారు. ఇంకా కార్పొరేటర్ల కేటాయింపులో కూడా జనాభా దామాషా ప్రకారం 64 డివిజన్లకు 23 మంది బీసీలకు సీట్లు కేటాయించింది. కోఆప్షన్‌ సభ్యురాలిగా జమలపూర్ణమ్మకు పదవిని ఇచ్చింది.

బీసీలకు రిజర్వేషన్‌ కల్పించే ప్రక్రియలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో సంప్రదించి పార్లమెంట్‌లో చట్టం చేయాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా రిజర్వేషన్లు కల్పిస్తామని హడావుడిగా జీవోలు ఇవ్వటం బీసీలను మభ్య పెట్టడమే. అంతేకాకుండా చంద్రబాబు బీసీలకు మంచి చేశారని క్షీరాభిషేకాలు చేయించుకోవటం తప్ప ఏ విధమైన మంచి జరగలేదు. రాజ్యాంగబద్ధంగా బీసీలకు హక్కులు కల్పించాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

– శేకుబోయిన సుబ్రహ్మణ్యం, బీసీ సంక్షేమ సంఘం కృష్ణాజిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement