చిలకలపూడి(మచిలీపట్నం): గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, వ్యక్తిగత మరుగుదొడ్లు, పారిశుద్ధ్య, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణం తదితర పనులను నిర్దేశించిన లక్ష్యాల మేరకు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో ఆర్‌డబ్ల్యూఎస్, ఐసీడీఎస్, పంచాయతీ తదితర శాఖల అధికారులతో గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలన్నారు. 2025–26 సంవత్సరానికి మంజూరైన 950 వ్యక్తిగత మరుగుదొడ్లలో 345 పూర్తయ్యాయని మిగిలిన పనులను వేగవంతం చేయాలన్నారు. 2026–27 సంవత్సరానికి గానూ 727 మంజూరయ్యాయని వాటి నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి వనరుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నీటి వనరుల పరీక్షలను నిరంతరం నిర్వహించి సురక్షిత తాగునీరు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సోమశేఖర్, డీఎల్‌పీవో రజావుల్లా తదితరులు పాల్గొన్నారు.


