ఇంటింటికీ పథకాలు ఇచ్చాం.. | - | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ పథకాలు ఇచ్చాం..

Oct 2 2026 7:38 AM | Updated on Oct 2 2026 7:38 AM

ఇంటింటికీ పథకాలు ఇచ్చాం.. వారికెందుకంత ప్రాధాన్యం..

ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా?

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ విశేష సేవలందించి, ఇంటింటికీ సంక్షేమాన్ని పంచిన గ్రామ/వార్డు సచివాలయ వలంటీర్లను దారుణంగా అవమానించారు.. వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లుగా ముద్రవేశారు.. వారికి ఇచ్చే రూ.5వేల గౌరవ వేతనం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే వారిని అవస్థల పాల్జేసి.. ఆ వ్యవస్థనే లేకుండా చేశారు.

సీన్‌ కట్‌ చేస్తే.. అదే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్‌ల పేరిట కొత్త వ్యవస్థను తీసుకొచ్చి భారీగా పంపకాలకు పూనుకుంది. ప్రజాసేవకు ఏమాత్రం ఉపయోగపడని ఒక భజన బృందానికి జనం డబ్బును వాడేందుకు సిద్ధమైంది. కేవలం సర్కారుకు డప్పు కొట్టేందుకే వారికి భారీ నజరానాలు ప్రకటించింది. దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో వలంటీర్లుగా పనిచేసిన వారు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. – సాక్షి నెట్‌వర్క్‌

కులమత వర్గ విబేధాలకు తావు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్న నాటి ప్రభుత్వ లక్ష్యం కారణంగా నిష్పక్షపాతంగా ఇంటింటికీ పథకాలు మేం అందించాం. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నేతలు, కార్యకర్తల జేబులు నింపటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. వలంటీర్‌ల కడుపు కొట్టడం అన్యాయం.

– యానకి నరేంద్ర, మాజీ వలంటీర్‌,

అనుమంచిపల్లి, జగ్గయ్యపేట

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఇంటికీ వెళ్లి వారికి కావాల్సిన పథకాలను అందించాం. ప్రాణాలను పణంగా పెట్టి రూ. 5వేల గౌరవ వేతనంతో వలంటీర్‌గా ఉద్యోగాలు చేశాం. మాకు ఇచ్చింది ప్రజాధనం దుర్వినియోగమని.. నేడేమో టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు లక్షలాది రూపాయలు దోచిపెట్టడం ఎంత వరకూ సమంజసం. ప్రభుత్వం పునరాలోచించాలి.

– కె. స్వప్న, మాజీ వలంటీర్‌,

నాగులూరు, రెడ్డిగూడెం

కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ వలంటీర్లుగా తాము ఇంటింటికీ వెళ్లి సేవలు అందించాం. వేకువ జామునే గడపగడపకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశాం. వలంటీర్లకు ఇచ్చిన హామీని టీడీపీ ప్రభుత్వం మరిచింది. రూ.5వేలు గౌరవ వేతనంతో ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని విమర్శించిన ఈ పాలకులు ఇప్పుడు వారి డబ్బా కొట్టుకునేందుకు రూ.లక్షలు చెల్లిస్తామని జీవోను విడుదల చేశారు. ఇది కదా దుర్వినియోగమంటే?

– సీహెచ్‌ నందిని, వలంటరీ, దండిగానపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement