రెడీమేడ్‌ చపాతీల్లో పురుగులు | - | Sakshi
Sakshi News home page

రెడీమేడ్‌ చపాతీల్లో పురుగులు

Oct 2 2026 7:38 AM | Updated on Oct 2 2026 7:38 AM

రెడీమేడ్‌ చపాతీల్లో పురుగులు కృష్ణానదిలో గుర్తు తెలియని మృతదేహం రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం హత్య కేసులో నిందితుడు అరెస్ట్‌

బంటుమిల్లి: రెడీమేడ్‌ చపాతీ పాకెట్లలో పురుగులు రావడం వినియోగదారుల్లో ఆందోళనకు కారణమైంది. ఇటీవల జనం ఇళ్లలో చపాతీలు, పూరీలు, పరోటాలు తయారు చేసుకోవడం ప్రయాసగా భావించి, మార్కెట్లో అమ్ముతున్న ప్యాకెట్లకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో మండలంలోని జానకీరామపురానికి చెందిన ఒక వినియోగదారుడు స్థానికంగా ఓ వ్యాపారి వద్ద బుధవారం రాత్రి రెడీమేడ్‌ చపాతీ ప్యాకెట్‌ కొన్నాడు. గురువారం ఉదయం చపాతీలు కాల్చుకుందామని ప్యాకెట్టు విప్పి చూడగా వాటిపై ముక్క పురుగులు, తోక పురుగులు అతుక్కొని ఉండటం చూసి గతుక్కుమన్నాడు. బిల్లు కోసం వ్యాపారిని అడిగితే తయారీదారు బిల్లు ఇవ్వనందున తాము కూడా ఇవ్వలేమని బదులిచ్చినట్టు వినియోగదారుడు చెప్పాడు. దుకాణాలకు సరఫరా అవుతున్న సరుకులు, తినుబండారాలపై క్వాలిటీ, ఫుడ్‌ ఇన్సెక్టర్లు, సేల్స్‌టాక్స్‌ అధికారులు తనిఖీలు చేసి ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పద్మావతి ఘాట్‌ సమీపంలో కృష్ణానదిలో నీటిలో ఒక మగ వ్యక్తి మృతదేహం తేలుతున్నట్లు గురువారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నీటి నుంచి బయటకు తీసి పరిశీలించారు. మృతుని వద్ద పేరు, ఏ ప్రాంతానికి సంబంధించి ఎటువంటి వివరాలు లభించలేదు. మృతుని వయస్సు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉండవచ్చని, ఛాతీపై లవ్‌ సింబల్‌, బీ, ఏ అని పచ్చబొట్లు, అదేవిధంగా కుడి చేతిపై పచ్చబొట్లు ఉన్నాయని తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. స్థానిక విజయవాడ రోడ్డులోని పోస్టాఫీసు సమీపంలో జరిగిన ఈ ఘటన చూపరులను కలచివేసింది. వివరాల్లోకి వెళ్లితే.. నూజివీడు రోడ్డులోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట ఉన్న ఇనుప పనిముట్ల తయారీ కొలిమిలో పని చేస్తున్న ఓరుగంటి కిరణ్‌ (25) బొగ్గులు తీసుకుని ద్విచక్ర వాహనంపై జంక్షన్‌ సెంటర్‌ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి పోస్టాఫీసు వద్ద రహదారి మధ్యలోని డివైడర్‌పై ఢీకొట్టింది. దీంతో కిరణ్‌ తలకు డివైడర్‌పై ఉన్న ఇనుప గ్రిల్స్‌ పదునుగా తెలగటంతో తీవ్ర రక్తస్రావంతో విగతజీవిగా పడిపోయారు. కిరణ్‌ కింద పడిపోయినప్పటికీ ద్విచక్ర వాహనం మాత్రం దాదాపు 100 మీటర్లు మేర వేగంగా రోడ్డు దూసుకుపోయింది. ఈ ప్రమాదం గూర్చి సమాచారం అందుకున్న హనుమాన్‌జంక్షన్‌ ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్‌ ఘటనాస్థలికి చేరుకుని మృతుని వివరాలు ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పటమట(విజయవాడతూర్పు): విజయవాడ ఆటోనగర్‌లో సెప్టెంబర్‌ 29న జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటోనగర్‌ వంద అడుగుల రోడ్డులో సిమెంట్‌ రాయితో తలపై మోది వ్యక్తి హత్య జరిగిందని స్థానికులు పటమట పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న సెంట్రల్‌ జోన్‌ ఏసీపీ దామోదర్‌, పటమట సీఐ పవన్‌ కిషోర్‌ కేసు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు అయ్యప్పనగర్‌కు చెందిన అప్పారావు కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో కృష్ణాజిల్లా నాగాయలంక ప్రాంతానికి చెందిన హరిబాబుతో పరిచయం ఏర్పడింది. సోమవారం రాత్రి సన్‌లైట్‌ సెంటర్‌ సమీపంలోని షెడ్డు వద్ద ఇద్దరూ మద్యం తాగుతుండగా హరిబాబు ఫోన్‌ కనిపించకపోవడంతో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అప్పారావుపై హరిబాబు దాడి చేసి, అనంతరం సిమెంట్‌ రాయితో తలపై మోది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం పరారైన హరిబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.ఈ కేసులో నిందితుడు హరిబాబును పటమట పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో హరిబాబును గన్నవరం జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement