● ఆయన భావి తరాలకు ఆదర్శనీయుడు
● చైతన్య యాత్ర ప్రారంభోత్సవ
సభలో వక్తలు
గుడ్లవల్లేరు: పాశ్చాత్య మోజులో పడిన నేటి తరం కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి అనే ఆణిముత్యాన్ని రాయిలా పక్కన పడేసి, ఆయన భావాలను తుంగలో తొక్కుతున్నారని సెంట్రల్ విజిలెన్స్ మాజీ కమిషనర్ కొసరాజు వీరయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. తన భావాల రచనలతో కవిరాజు ప్రజా చైతన్యం తీసుకువచ్చారని చెప్పారు. కవిరాజు కోసం కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు నుంచి తెనాలి వరకు నిర్వహించిన చైతన్య యాత్రను గురువారం ఆయన ప్రారంభించారు. స్వాతంత్రం రాకముందే కాలం చేసిన కవిరాజు సిద్ధాంతాలు ఈ రోజుల్లో యువతకు తెలియాల్సి ఉందన్నారు. ఇలాంటి యాత్రలో విద్యార్థులు అత్యధికంగా పాల్గొనటం మంచి మార్పుకు శ్రీకరమని పేర్కొన్నారు. కవిరాజు భావజాలాన్ని ఈనాటి తరానికి అందించేందుకు చేస్తున్న చైతన్య యాత్ర సఫలీకృతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కవిరాజు రచనలతో సీనియర్ ఎన్టీఆర్ ఎంతో చైతన్యం పొందారని మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ నటించిన పలు పౌరాణిక సినిమాలు కవిరాజు కలం నుంచి జాలువారిన రచనల్లోనివేనన్నారు. భావితరాలకు కవిరాజు ఆదర్శనీయులని పేర్కొన్నారు.
కవిరాజు పుట్టిన గడ్డలో మట్టి వాసన....
కవిరాజు పుట్టిన అంగలూరు తాను వస్తే ఆ మట్టి వాసనలో ఆయనతో పాటు ఆయన రచించిన చైతన్యవంతమైన రచనలు ఇమిడి ఉంటాయని సినీ నటుడు త్రిపురనేని సాయిచంద్ పేర్కొన్నారు. ఇదే గ్రామంలో అష్టావధానం శతావదానానికి కవిరాజు శ్రీకారం చుట్టారని తెలిపారు. 1919లో జంభూకవధ రచన ఇక్కడే పుట్టి సంచలనం సృష్టించిందన్నారు. ఈ నాటకాన్ని ఆనాడు రంగూన్, సౌత్ ఆఫ్రికాలో ప్రదర్శిస్తే అప్పటి ప్రజల్లో అనేక మార్పులు వచ్చి చైతన్యవంతులుగా మారారని పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘ అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, రచయితలు గుమ్మా సాంబశివరావు, గోపీచంద్, గ్రామ మాజీ సర్పంచ్ మేడేపల్లి రవికుమార్, మాజీ ఉప సర్పంచ్ త్రిపురనేని సురేష్ బాబు, చిలుముల ఫణి తదితరులు పాల్గొన్నారు.


