గుడివాడరూరల్: ౖమెనర్ బాలికను కిడ్నాప్ వ్యవహారంలో ఆరుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుడివాడ తాలూకా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని శేరీగొల్వేపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అక్రమంగా నిర్భంధించి, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్‌లతో పాటు ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితులు మొగడటి రోహిత్, మొగడటి ఆనంద్, సునీత, బాలశౌరి, దుర్గ, బెర్నాడ్‌లు మైనర్‌కు సంబంధించిన వ్యవహారంలో జోక్యం చేసుకుని ఆమెను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత నెల 28న మధ్యాహ్నం బాలిక ఇంటి నుంచి కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈక్రమంలో బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద విచారణ చేసినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఈనెల 29 రాత్రి 11 గంటల సమయంలో బాలశౌరి బాలికను ఆటోలో తీసుకెళ్లినట్లు ఆమె కుటుంబసభ్యులకు సమాచారం తెలిసింది. దీంతో వెంటనే వారు తాలూకా పోలీసులను ఆశ్రయించారు. బాలికకు మాయ మాటలు చెప్పి తమ వెంట తీసుకెళ్లిన నిందితులు ఆమెను వారి ఇంట్లో రెండు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి, అనంతరం ఆటోలో తరలించారు. ఫిర్యాదు అందిన వెంటనే తాలూకా ఎస్‌ఐ ఎన్.చంటిబాబు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. గుడివాడ మండలం శేరిగొల్వేపల్లికి చెందిన, ప్రస్తుతం గుంటూరు జిల్లా మంగళగిరిలో నివాసం ఉంటున్న ఎ1 నిందితుడు మొగదాటి రోహిత్ (20)ను గురువారం మధ్యాహ్నం గుడివాడ రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్ విధించినట్టు తెలిపారు.
పూసపాటిరేగ: విజయనగరం జిల్లా భోగాపురం మండలం లింగాలవలస వద్ద వ్యాన్, లారీ ఢీకొన్న ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ వైపు నుంచి శ్రీకాకుళం వెళ్తున్న లారీని అదే దిశలో వేగంగా ఉల్లిపాయల లోడుతో వెళ్తున్న వ్యాన్ భోగాపురం మండలం లింగాలవలస సమీపంలో జాతీయ రహదారిపై అదుపుతప్పి బలంగా ఢీకొంది. వ్యాన్ డ్రైవ్ చేస్తున్న కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని పెదపట్నం గ్రామానికి చెందిన తోకల నవీన్ (32) వ్యాన్‌లో ఇరుక్కోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని క్రేన్ సహాయంతో బయటకు తీసి చికిత్స నిమిత్తం విజయనగరం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహానికి పంచనామా చేసి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు భోగాపురం పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


