మచిలీపట్నంఅర్బన్: వైద్య, ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, వారిని క్రమబద్ధీకరించాలని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేశ్‌బాబు డిమాండ్ చేశారు. ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీ ఎంహెచ్‌సీజేఏసీ) ఆధ్వర్యంలో గురువారం రాత్రి మచిలీపట్నంలో కాంట్రాక్టు వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ డిమాండ్లకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సురేశ్‌బాబు మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారం, క్రమబద్ధీకరణ, గ్రాస్ శాలరీ చెల్లింపు తదితర డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత పోరాటం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బి. సౌమ్యరేఖ మాట్లాడుతూ ‘దశాబ్దాల సేవకు గుర్తింపు కావాలి.. కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరణ కావాలి’ అనే నినాదంతో క్యాండిల్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, క్రమబద్ధీకరణ సాధ్యం కాని పరిస్థితిలో తక్షణమే 100 శాతం వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆకూరి శ్రీనివాస్ కాంట్రాక్టు ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులతో కలిసి పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం, జేఏసీ కన్వీనర్ బాలు, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాల సుబ్రహ్మణ్యం, జిల్లా జేఏసీ కోఆర్డినేటర్ లోకేష్ కుమార్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కన్వీనర్ చంద్రపాల్, వెద్య, ఆరోగ్యశాఖకు చెందిన కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.


