గుడ్లవల్లేరు: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అర్హులందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు జరుగుతాయని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ‘పేదల సేవలో 2.’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని డోకిపర్రులో గురువారం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన పేదలకు నేరుగా అందించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పని చేస్తోందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పింఛను లబ్ధిదారు సారమ్మతో మాట్లాడి ఆమె కుటుంబ పరిస్థితులు, పింఛన్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలు సకాలంలో అందుతున్నాయా లేదా అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల సమాచారం చేరేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.


