కృష్ణా జెడ్పీ ఇక .. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా పరిషత్‌లుగా ఏలూరు జెడ్పీలో రెండు నియోజకవర్గాలు ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల జెడ్పీకి 66 వసంతాలు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నూతన జిల్లాల విభజన
జిల్లా మారింది.. పాలనా స్వరూపం మారింది. ఇప్పుడు జిల్లా పరిషత్ రూపురేఖలు మారనున్నాయి. 66 ఏళ్లుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో గ్రామీణాభివృద్ధికి దిక్సూచిగా నిలిచిన జిల్లా పరిషత్.. జిల్లాల పునర్విభజనతో రెండు జెడ్పీలుగా రూపాంతరం చెందనుంది. జిల్లా బోర్డు నుంచి జెడ్పీగా ఎదిగిన ప్రస్థానంలో ఎందరో నాయకులు తమదైన ముద్ర వేశారు.
చిలకలపూడి(మచిలీపట్నం): ఆరు దశాబ్దాలకు పైగా ప్రజాపాలనకు వేదికగా నిలిచిన కృష్ణా జిల్లా పరిషత్ ఇప్పుడు మరో కీలక మలుపు తిరగనుంది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రభుత్వం శనివారం ఇచ్చిన జీవోతో ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ రెండు జిల్లా ప్రజా పరిషత్‌లు కానుంది. ఏలూరు జెడ్పీలో రెండు నియోజకవర్గాలు విలీనం కానున్నాయి. కృష్ణాలో 25 మండలాలు, ఎన్టీఆర్‌లో 15 మండలాలతో జెడ్పీలు ఏర్పడనున్నాయి. మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల విభజన చేశారు. వీటి ఆధారంగా నేడు జిల్లా పరిషత్‌లు కూడా విభజన జరగనుంది. సెప్టెంబరు 24తో ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం పూర్తికానుంది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ రూపాంతరాలపై కథనం.
జిల్లా బోర్డు నుంచి జిల్లా ప్రజాపరిషత్‌గా
జిల్లా పరిషత్ ఏర్పాటుకు ముందు జిల్లా బోర్డుగా ఉండేది. ప్రభుత్వం నామినేటెడ్ సభ్యులను నియమించి పాలన సాగించేది. పాఠశాల నిర్వహణ, రహదారులు, గ్రంథాలయాల నిర్వహణ వంటి బాధ్యతలను బోర్డు నిర్వహించేది. అనంతరం 1959లో తీసుకొచ్చిన చట్టంతో జిల్లా పరిషత్‌గా మార్పు జరిగింది. జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఉమ్మడి కృష్ణాజిల్లాలో సమితి అధ్యక్షులతో పాటు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎన్నుకునేవారు. తర్వాత 1987లో జిల్లా ప్రజాపరిషత్‌గా మార్పు చెంది మండల పరిషత్ టెరిటోరియల్ కాన్‌స్టెన్సీ (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్‌స్టెన్సీ (జెడ్పీటీసీ)లుగా ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీలుగా ఎన్నికై న సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎన్నుకునే విధానం ప్రారంభమైంది.
వన్నె తెచ్చిన ఎందరో నాయకులు
జెడ్పీ ఏర్పడిన అనంతరం తొలిసారిగా 1960లో యార్లగడ్డ శివరామప్రసాద్ (చల్లపల్లి రాజా) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1962 నుంచి 64 వరకు మాగంటి అంకినీడు, 1964 నుంచి 76 వరకు తిరిగి 1981 నుంచి 83 వరకు పిన్నమనేని కోటేశ్వరరావు చైర్మన్లుగా పనిచేశారు. 1983 నుంచి 86 వరకు సుంకర సత్యనారాయణ, 1987 నుంచి 92 వరకు పిన్నమనేని కోటేశ్వరరావు చైర్మన్లుగా చేశారు. 1995 నుంచి 2000 వరకు కడియాల రాఘవరావు, 2001 నుంచి 06 వరకు నల్లగట్ల సుధారాణి, 2006 నుంచి 11 వరకు కుక్కల నాగేశ్వరరావు, 2014 నుంచి 19 వరకు గద్దె అనూరాధ చైర్మన్లుగా పనిచేశారు. 2021లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చైర్‌పర్సన్‌గా ఉప్పాల హారిక ఇప్పటి వరకు విధులు నిర్వహిస్తున్నారు. చైర్మన్‌గా పిన్నమనేని మూడు పర్యాయాలు ఉన్నారు. 1960 నుంచి 2026 వరకు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్లుగా మొత్తం 10 మంది పదవిని అలంకరించారు.
వైఎస్సార్ సీపీ హయాంలో నూతన హంగులు
వైఎస్సార్ సీపీ హయాంలో జిల్లా పరిషత్‌కు నూతన హంగులు సమకూరాయి.
వైఎస్సార్ సీపీ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పాలన చేరువ చేయాలనే ఉద్దేశంతో జిల్లాల పునర్విభజన చేశారు. దీని ప్రాతిపదికన జిల్లా ప్రజాపరిషత్‌లను కూడా విభజించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ఆధారంగా ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజా పరిషత్ కృష్ణా జిల్లా, నూతనంగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లాలో కై కలూరు, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 8 మండలాలు కలవనున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న 25 మండలాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ 25 మండలాల్లోని జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు.


