టీచర్స్ డే వేడుకల్లో ఇన్‌చార్జ్ కలెక్టర్ నవీన్
చిలకలపూడి(మచిలీపట్నం): ఉపాధ్యాయులు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా విద్యార్థుల్లో విలువలు, మానవత్వం, ఆత్మవిశ్వాసం, దేశభక్తి వంటి సుగుణాలను పెంపొందించాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. మాజీ రాష్ట్ర పతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శనివారం ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని జెడ్పీ కన్వెన్షన్ హాలులో జిల్లా స్థాయి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 39 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేశారు. నవీన్ మాట్లాడుతూ తల్లి, తండ్రి, గురువు ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తారన్నారు. ఉపాధ్యాయులు చేసే ప్రతి పని విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ప్రస్తుత కాలంలో ఏఐ ద్వారా విస్తృతమైన సమాచారాన్ని పొందగలుగుతున్నా విద్యార్థి ఎందుకు ప్రశ్న అడుగుతున్నాడు, అతనికి ఏమి అవసరం – బలహీనతలు ఏంటనే విషయాలను గుర్తించి ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగేది ఉపాధ్యాయుడు మాత్రమేనన్నారు. అందుబాటులో ఉన్న మౌలిక, డిజిటల్ సౌకర్యాలను సమర్థంగా వినియోగించుకుని బోధనా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలన్నారు. పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యాన్ని సాధించేందుకు ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తొలుత విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో డీఈవో యూవీ సుబ్బారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), డీవైఈవోలు శేఖర్‌సింగ్, కె. రవికుమార్, ఏడీ ఎం.విద్యాలత, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ కె. విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.


