ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గగుడికి పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణానికి నివేదికలను సిద్ధం చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై రూ.52.50కోట్లతో నిర్మించిన కనకదుర్గ అన్నప్రసాద సదనం, శ్రీదుర్గా భవానీ మహా ప్రసాద భవనాలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి, పూజలు చేశారు. ఘాట్‌రోడ్డు నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు. ఘాట్‌రోడ్డులో 25అడుగుల ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కంచిపీఠం వారు కోరారని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే, కుమ్మరిపాలెంలో టీటీడీ స్థలంలో 7 అంతస్తుల భవనం నిర్మించి, త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు సుజనాచౌదరి, యార్లగడ్డ వెంకట్రావు, దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
అన్నదాన భవనం ప్రారంభోత్సవంలో
మంత్రి ఆనం


