చెరువుల తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు | - | Sakshi
Sakshi News home page

చెరువుల తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు

Aug 22 2026 2:11 AM | Updated on Aug 22 2026 2:11 AM

చెరువుల తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు

పెడన: కృష్ణాజిల్లా పెడన మండలంలోని ఉరివి పంచాయతీ గాయంపాడు గ్రామ పరిధిలో శుక్రవారం ఉదయం చెరువులను తవ్వుతున్నారని తెలిసి గాయంపాడు గ్రామస్థులు అడ్డుకున్నారు. శ్మశానం పక్కనే ఈ చెరువులను తవ్వడం వల్ల శ్మశానంలోనికి ఊటనీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని, చెరువు తవ్వడానికి కుదరదని, దూరంగా తవ్వుకోవాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గాయంపాడుకు చెందిన రైతు ఉప్పలపాటి కిరణ్‌కుమార్‌ ఈ ఏడాది మార్చిలో 19.75 ఎకరాల ఖాళీ పంట భూమిని చెరువులుగా తవ్వుకోవడానికి మత్స్యశాఖకు అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. ఆక్వాజోన్‌ పరిధిలో లేకపోయినా మత్స్యశాఖ వారు క్షేత్రస్థాయిలో పరిశీలించలేదని గ్రామస్తులు అంటున్నారు. పక్కనే ఉన్న రైతుల అభిప్రాయాలను, పక్కనే ఉన్న శ్మశానికి సంబంధించిన వారిని సంప్రదించకుండా, వారి నుంచి నిరంభ్యంతర పత్రాలు తీసుకోకుండా మత్స్యశాఖ వారు అనుమతులు మంజూరు చేసేశారు. ఈ అనుమతులను బేస్‌ చేసుకుని మిగిలిన శాఖల వారు కూడా అనుమతులు ఇచ్చేశారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ చెరువులను లీజుకు తీసుకున్న వారు శుక్రవారం చెరువుల తవ్వకం పనులు ప్రారంభించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. హైకోర్టు నుంచి అనుమతులున్నాయని, తప్పుకోవాలని లీజుదారులు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో లీజుదారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగప్రవేశం చేశారు. ఇరుపక్షాలతో మాట్లాడి ఎటువంటి గొడవలు లేకుండా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో గ్రామస్తులు లీజుదారులతో చర్చలు జరిపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇంత గొడవ జరుగుతున్నా రెవెన్యూ వారు మాత్రం అటుగా వెళ్లపోవడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement