ఏ బిడ్డా.. ఇది మా అడ్డా! | - | Sakshi
Sakshi News home page

ఏ బిడ్డా.. ఇది మా అడ్డా!

Aug 13 2026 1:57 AM | Updated on Aug 13 2026 1:57 AM

విజయవాడ బస్టాండ్‌ బయట ప్రైవేటు దందా!

దూర ప్రాంత ప్రయాణికులే లక్ష్యం బారులు తీరుతున్న కార్లు, మినీ వ్యాన్‌లు, బస్సులు బస్టాండ్‌ లోపల ప్లాట్‌ఫాంలపై నిలబడిన ప్రయాణికులకు వల సొంత సంస్థకే కన్నం పెడుతున్న ఆర్టీసీలోని కొందరు అధికారులు పట్టించుకోని ఆర్టీసీ యాజమాన్యం

ఇంటి

దొంగలున్నారు!

సాక్షి, విజయవాడ: దేశంలోనే అతిపెద్ద బస్టాండ్‌ అయిన విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ నుంచి ప్రయాణికులు భారీగా రాకపోకలు సాగిస్తుంటారు. అయితే తగినన్ని ఆర్టీసీ బస్సులు లేకపోవడం.. ఉన్నా నిర్ణీత వేళకు రాకపోవడం.. సీ్త్రశక్తి బస్సుల్లో కిక్కిరిసి ఎక్కుతుండటంతో.. ఇదే అదునుగా కొందరు ప్రైవేటు వాహనదారులు ఆర్టీసీకి గండి కొడుతున్నారు. బస్టాండ్‌ బయటే వాహనాలను పెట్టుకుని.. వారి మనుషులను ప్లాట్‌ఫాంల వద్దకు పంపి.. అక్కడ బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులతో మాట కలిపి తమ వాహనాల్లో ఎక్కేలా చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు ఆలస్యంగా వెళ్తుందని, కారు, వ్యాన్‌లలో అయితే కావాల్సిన చోటు ఆపుతారని.. త్వరగా గమ్యస్థానం చేరుకోవచ్చని ప్రయాణికులను ఒప్పిస్తున్నారు. అందుకుగానూ సదరు వ్యక్తులకు కొంత కమీషన్‌ కూడా వాహనదారుల నుంచి అందుతోంది.

ఇదీ పరిస్థితి..

విజయవాడ బస్టాండ్‌ నుంచి రోజూ 2లక్షల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. మొత్తం 2,700 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తాయి. బస్టాండ్‌లో మొత్తం 62 ప్లాట్‌ ఫాంలు ఉండగా.. డిపార్చర్‌ బ్లాక్‌లో 46, అరైవల్‌ బ్లాక్‌లో 16 ప్లాట్‌ఫాంలు, వాటిల్లో రెండు కార్గో సర్వీసులకు కేటాయించారు. అలాగే గవర్నర్‌ పేట 1, 2 డిపోలు, ఆటోనగర్‌, ఇబ్రహీంపట్నం డిపోలు ఉన్నాయి. ఈ డిపోల నుంచి సిటీ సర్వీసులు తిరుగుతాయి. అయితే విజయవాడ నుంచి తెలంగాణ, చైన్నె, కర్ణాటక, బెంగళూరు, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలకు సర్వీసులు నడుస్తున్నాయి.

వీకెండ్‌లో మరింత డిమాండ్‌..

వారాంతపు సెలవు దినాలు, పండుగల సమయాల్లో, కళాశాలలకు సెలవు దినాల్లో ప్రైవేటు వాహనదారులు టార్గెట్‌గా పెట్టుకుని ప్రయాణికులను తరలిస్తున్నారు. ఆయా దినాల్లో ఆర్టీసీ సర్వీసులు సైతం తక్కువగా ఉంటుండటంతో ప్రైవేటు వ్యక్తులు ఇదే అవకాశంగా మలుచుకుంటున్నారు. కొందరు సొంత లేదా ఆఫీసు పనుల నిమిత్తం విజయవాడ వచ్చేటప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు యాప్‌లను ఓపెన్‌ చేసుకుని ప్రయాణికులను తరలిస్తున్నారు.

ప్రయాణం పదిలమేనా?

ప్రైవేటు వాహనాల్లో ప్రయాణాలు అంత క్షేమకరం కాకపోయినా.. ప్రయాణికులు కార్లలో వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. వేగంగా వెళ్లేటప్పుడు ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగితే కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. ఆర్టీసీలో అయితే ఏదైనా ప్రమాదం బారిన పడితే వారికి బీమా రక్షణ ఉంటుంది. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు వివరించాలి.

వ్యక్తిగత కార్లలో కూడా..

విజయవాడకు వ్యక్తిగత పనుల మీద వచ్చే కొంద రు బడాబాబులు, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ విజయవాడకు వచ్చే కొందరు సాఫ్ట్‌వేర్‌, పేరున్న కంపెనీల్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు చేసే కొందరు.. ఖాళీగా వెళ్లడం ఎందుకు.. నలుగురు ఎక్కినా డీజిల్‌కు, చేతిఖర్చులకు వస్తాయన్న ఉద్దేశంతో ప్రయాణికులను పలు యాప్‌ల ద్వారా ఎక్కించుకుంటున్నారు. మరి కొందరేమో వ్యక్తిగత పనుల మీద విజయవాడకు వచ్చేటప్పుడు.. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ప్రైవేటు యాప్‌ల ద్వారా ప్రయాణికులను తీసుకెళ్తున్నారు.

ఆర్టీసీ నిబంధనల ప్రకారం బస్టాండ్‌కు 10 కిలోమీటర్ల వరకు ప్రైవేటు వాహనాలను నిలపకూడదనే నిబంధనను ప్రైవేటు వాహనదారులు ఖాతరు చేయడం లేదు. దీనికితోడు ఆర్టీసీలోని ఉన్నతాధికారులు సైతం కొందరు ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేసుకుని ప్రయాణికులను తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు సైతం చూసీచూడనట్లు వదిలేస్తుండటం వారికి కలిసి వస్తోంది. ప్రైవేటు వాహనాలను బస్టాండ్‌ సమీపంలోని కంట్రోల్‌ రూం దగ్గర, బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న కృష్ణలంక రోడ్డులో నిలుపుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికులను ఎక్కించుకోవడానికి పోటీ పడుతుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement