పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులకు పురిటి నొప్పులు లబ్బీపేట(విజయవాడతూర్పు): చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం నిండు గర్భిణుల పాలిట శాపంగా మారుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో సౌకర్యాల లేమితో అరకొరగా ప్రసవాలు చేస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి సైతం పురిటి నొప్పులతో గర్భిణులు విజయవాడ జీజీహెచ్‌కు చేరుకుంటున్నారు. ఇలా నాలుగు జిల్లాల నుంచి రావడంతో జీజీహెచ్‌పై అధిక భారం పడుతోంది. ఒక్కోసారి పడకలు చాలక ఒకే బెడ్‌పై ఇద్దరు గర్భిణులు, బాలింతలు ఉండాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంటోంది.
విజయవాడ ప్రభుత్వాస్పత్రి ప్రసూతి విభాగానికి కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు జిల్లాల నుంచి గర్భిణులు ప్రసవం కోసం వస్తుంటారు. వీరిలో కొందరు ఇక్కడే గర్భం దాల్చిన సమయం నుంచి మందులు వాడే వారు ఉంటుండగా, మరికొందరు అత్యవసరంగా ఇతర ఆస్పత్రుల నుంచి రిఫర్ చేసిన వారు ఉంటున్నారు. అంతేకాదు తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు వంటి ఆస్పత్రుల నుంచి సాయంత్రం అయితే చాలు గర్భిణుల పరిస్థితి ఏమాత్రం క్రిటికల్‌గా ఉన్నా విజయవాడకు తరలించేస్తున్నారు. వాళ్లు ఇక్కడికి వచ్చి సాధారణ ప్రసవం జరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవం కోసం వెళ్తే రూ.లక్షకు పైగా బిల్లు చెల్లించాల్సి వస్తోంది. అంతేకాక పుట్టిన బిడ్డకు ఎన్‌ఐసీయూలో చికిత్స అవసరం అయితే ఎన్ని రూ.లక్షలు అవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో పేదలే కాదు, మధ్యతరగతి ప్రజలు సైతం ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలకు వెళ్లేందుకు ధైర్యం చేయడం లేదు. సాధారణ ప్రసవాలు, సిజేరియన్‌లను ఆరోగ్యశ్రీలో చేర్చినా ఒక్క ప్రైవేటు ఆస్పత్రి కూడా ఆ పథకంలో ప్రసవం చేసేందుకు ముందుకు రాకపోవడంతో జీజీహెచ్ పెద్ద దిక్కుగా మారింది. ప్రభుత్వం సైతం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడంతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు.
గత ప్రభుత్వంలో మూడు కొత్త యూనిట్లు..
విజయవాడ జీజీహెచ్‌లోని ప్రసూతి విభాగంలో ఒకప్పుడు మూడు యూనిట్లు ఉండేవి. ఒక్కో యూనిట్‌కు 30 పడకలు చొప్పున 90 పడకలు అధికారికంగా ఉండేవి. అవి చాలక తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో గత ప్రభుత్వంలో మరో మూడు యూనిట్లు మంజూరు చేశారు. దీంతో అదనంగా 90 పడకలు పెరగడంతో పాటు, వైద్యులు, వైద్య సిబ్బంది కూడా వచ్చారు. దీంతో ప్రస్తుతం ఆరు యూనిట్లు ఉండగా 180 పడకలు అధికారికంగా ఉన్నాయి. లేబర్ రూమ్‌లో మరో 20 పడకలు ఉన్నాయి. మరికొన్ని పడకలు అనధికారికంగా కలిపి మొత్తం మీద 225 పడకలు వరకూ ఉన్నాయి. అయినప్పటికీ పడకలు చాలని పరిస్థితి నెలకొంది. ఒక్కోసారి 250 నుంచి 300 మంది వరకూ గర్భిణులు, బాలింతలతో పాటు, గర్భకోశ వ్యాధులకు గురైన మహిళలు చికిత్స పొందుతూ ఉంటారు.
నాలుగు జిల్లాల నుంచి..
పీహెచ్‌సీల్లో దిగజారిన సేవలు..
గత ప్రభుత్వంలో నాడు–నేడు పథకం ద్వారా పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీలను అత్యాధునికంగా తీర్చిదిద్దారు. అంతేకాక లేబర్ రూమ్స్ ఏర్పాటు చేసి, అత్యాధునిక డెలివరీ టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రసవాలు చేసేందుకు అనువైన పరిస్థితిని కల్పించారు. ప్రస్తుత ప్రభుత్వం వైద్య రంగం పట్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా అవన్నీ మూలన పడ్డాయి. అధిక శాతం పీహెచ్‌సీల్లో ప్రసవాలు జరగని పరిస్థితి నెలకొంది.
ప్రైవేటుకు వెళ్లలేక..
గర్భిణులు, బాలింతలపై
చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం
ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య
కేంద్రాలను పట్టించుకోని వైనం
అక్కడ వైద్యం అందక
విజయవాడ జీజీహెచ్‌కు రాక
నాలుగు జిల్లాల నుంచి వస్తుండటంతో
ఆస్పత్రిపై విపరీతమైన భారం
పడకలు చాలక ఒక్కో బెడ్‌పై
ఇద్దరేసి చొప్పున ఉంచాల్సిన దుస్థితి