గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దడంలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో నిరంతరాయంగా కృషి చేసి గణనీయమైన ఫలితాలను సాధించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఎన్‌కార్డ్, నషా ముక్త్ భారత్ కార్యక్రమాలపై సమావేశం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ విజయవాడకు సంబంధించి ‘గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్’ అనే నానుడి ఇకపై వినిపించకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
100శాతం నియంత్రణ..
ఎన్టీఆర్ జిల్లాలో గంజాయి నియంత్రణకు సంబంధించి 100 శాతం లక్ష్యాన్ని సాధించామని పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. పోలీస్ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సమన్వయంతో పనిచేయడం వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. గత రెండు విడతల్లో నిర్వహించిన గంజాయి నిరోధక కార్యక్రమాల్లో భాగంగా 1,287 మందిని పాజిటివ్ కేసులుగా గుర్తించి నిరంతర పర్యవేక్షణ చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ‘ఈగల్ 1972’ కార్యక్రమానికి సంబంధించిన ప్రదర్శనతో పాటు, ‘సే నో టు డ్రగ్స్’ వాల్ పోస్టర్‌ను కలెక్టర్‌తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ ప్రతిజ్ఞ చేయించారు. డీసీపీ అడ్మిన్ కె.జి.వి.సరిత, ఎన్టీఆర్ జిల్లా ఈగల్ అధికారి రవీంద్ర, జిల్లా వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి వి.కామరాజు, హెల్త్ కేర్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ అనిల్ కుమార్, ఆకాష్ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ,
సీపీ రాజశేఖరబాబు


