చిలకలపూడి(మచిలీపట్నం): యువత దేశానికి అమూల్యమైన ఆస్తి అని, యువతలో చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు వారిని దుర్వసనాలకు దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి అన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్ భవన్‌లో న్యాయవిజ్ఞాన సదస్సు జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశాల్లో మనదేశం ముందంజలో ఉందన్నారు. యువత తమ శక్తి, ప్రతిభను దేశాభివృద్ధికి వినియోగించాలన్నారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. పదో అదనపు జిల్లా న్యాయమూర్తి సీహెచ్ దుర్గాపూర్ణిమ, జిల్లా పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ఓవీ నాగేశ్వరరావు, పోక్సో కోర్టు న్యాయమూర్తి జి. వెంకటేశ్వర్లు, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎస్. వరలక్ష్మి, మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తుంగల హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
నేడు వారణాసి సర్వీస్ ప్రారంభం
గన్నవరం: స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం సాయంత్రం 5.30 గంట లకు కోల్‌కతా–వారణాసి–విజయవాడ మధ్య ఇండిగో నూతన విమాన సర్వీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎం. లక్ష్మీకాంతరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సర్వీస్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని పేర్కొన్నారు. విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు, స్థానిక ఎమ్మెల్యే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
నేరాల నియంత్రణకు కఠిన చర్యలు
పెనమలూరు: జిల్లాలో నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. కానూరు అన్నే కల్యాణ మండపంలో బుధవారం జిల్లా అర్ధ సంవత్సరం క్రైమ్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు మాట్లాడుతూ రాత్రి సమయాల్లో గస్తీ, బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులు త్వరతగతిన విచారణ పూర్తిచేసి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని స్పష్టం చేశారు. పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన పెంచాలని, పాతనేరస్తులు, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉండాలని తెలిపారు. గంజాయి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
హెచ్‌ఐవీ రహిత రాష్ట్రమే లక్ష్యం
భవానీపురం(విజయవాడపశ్చిమ): హెచ్‌ఐవీ, ఎయిడ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ ఏడాది డిసెంబర్ ఒకటి నాటికి నిర్దేశిత 95–95–99 లక్ష్యాలను వంద శాతం సాధించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ సాధనలో యువతతోపాటు స్వచ్ఛంద సేవా సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఏపీ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఏపీ శాక్స్) ఆధ్వర్యాన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన 60రోజుల ప్రత్యేక ప్రచార, విద్య ప్రచారం పేరుతో రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ‘సురక్ష డ్యాష్ బోర్డ్’ను ఆవిష్కరించారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్ మాట్లాడుతూ రానున్న 60 రోజులపాటు గ్రామాలు, పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు, ఏపీ శాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ స్మరణ్ రాజ్ మాట్లాడారు. ఏపీ శాక్స్ ఇన్‌చార్జ్ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ భాగ్యలక్ష్మి, జేడీఐఈసీ డాక్టర్ మంజుల, జేడీ టీఐ సుకుమార్, జేడీ బీఎస్‌డీసీఎస్‌టీ డాక్టర్ శ్రీనివాస వర్మ, జేడీ బీటీఎస్ డాక్టర్ చక్రవర్తి పాల్గొన్నారు.


