ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు ఆలయ సిబ్బంది అమ్మవారికి సారెను సమర్పించారు. గత నెల 15వ తేదీ నుంచి ప్రారంభమైన ఉత్సవాలలో భాగంగా నాలుగు రాష్ట్రాల నుంచి సుమారు ఆరు లక్షల మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. దేవస్థానం తొలిసారిగా సారె సమర్పించిన భక్తుల వివరాలతో రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఆషాఢ మాసంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భక్తులు అమ్మవారికి సారెను సమర్పించారు. శుక్రవారం, వీకెండ్‌లలో సుమారు 70వేల నుంచి 80వేల మందికి పైగా భక్తులు అమ్మవారికి సారె సమర్పించగా, సాధారణ రోజులలో సగటున 15వేల మందికి పైగా భక్తులు సారె సమర్పించారని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ఏపీ, తెలంగాణలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి భక్తులు విచ్చేశారని వివరించారు.
అంగరంగ వైభవంగా..
బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మేళతాళాలతో ఊరేగింపు కనకదుర్గనగర్‌కు చేరుకుంది. కనకదుర్గనగర్‌లో బలిపీఠం అమ్మవారికి పసుపు, కుంకుమ, పూజా సామగ్రిని సమర్పించిన అనంతరం మహామండపం మీదగా ఆలయానికి చేరుకున్నారు. ప్రధాన ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి సారెను అందజేశారు. చివరి రోజు కావడంతో పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్త బృందాలు ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కోట ప్రసాద్, ఏసీ రంగారావు, ఈఈ ఎల్.రమాదేవి, ఏఈవోలు ఎన్. రమేష్‌బాబు, తిరుమలేశ్వరరావు, గంగాధర్, డీఈఈ అశోక్‌కుమార్, రవీంద్రనాథ్, సూపరింటెండెంట్లు, ఆలయ సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి సంబరంలో పాల్గొన్నారు.
ఆషాఢ మాసం చివరి రోజున దుర్గమ్మకు సారె సమర్పించిన ఆలయ సిబ్బంది


